ఏపీతో రఫేల్ నాదల్‌కు లింకేంటో తెలుసుకోవాల్సిందే..
posted on Feb 2, 2022 3:44PM
స్పెయిన్ బుల్.. క్లే కోర్ట్ టెన్నిస్ సూపర్ స్టార్.. రఫేల్ నాదల్. తాజాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం చేసుకొని.. 21 గ్రాండ్‌స్లామ్‌లతో దూకుడు మీదున్నాడు. టెన్నిస్ కోర్టులోనే నాదల్ దూకుడంతా. కోర్టు బయట ఆయన చాలా సాఫ్ట్. నాదల్‌కు ఏపీతో మంచి అనుబంధం ఉంది.
2010లో రఫెల్.. మన అనంతపురంలో నాదల్ ఎడ్యూకేషనల్ టెన్నిస్ స్కూల్ ఏర్పాటు చేశాడు. కరవు ప్రాంతంగా పేరున్న అనంతలో పేద పిల్లలకు ఆటను చేరువ చేసేందుకు ప్రపంచ ప్రమాణాలతో టెన్నిస్ అకాడమీ స్థాపించాడు. ఎక్కడ స్పెయిన్.. ఎక్కడి అనంత.. మంచి మనసే ఆయన్ను ఆంధ్రాకు చేరువ చేసింది.
స్పెయిన్‌కు చెందిన ఫెర్రర్ ఫ్యామిలీ అనంతపురం జిల్లాలో నిర్వహించే రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌తో జతకట్టి.. ఈ స్కూల్‌ను స్టార్ట్ చేశాడు. ప్రారంభోత్సవానికి స్వయంగా రఫెల్ నాదల్, తల్లి అనా మారియాతో కలిసి వచ్చాడు. అనంతపురంలోని నాదల్ టెన్నిస్ స్కూల్.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ఉచితంగా క్రీడా పరికరాలు ఇచ్చి.. నిపుణులైన కోచ్‌లతో శిక్షణ ఇస్తోంది. రఫేల్ నాదల్.. 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కైవసం చేసుకున్న సందర్భంగా ఆ పిల్లలంతా సంబరాలు చేసుకున్నారు. మరిన్ని టైటిల్స్ గెలవాలని కాంక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా రఫేల్ నాదల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...
--రఫెల్ నాదల్ రెండు చేతులతో ఆడగలడు. ఫోర్ హ్యండ్ షాట్‌కు ఎడమ చేతిని వాడతాడు. రెండు చేతులతో టూహ్యాండెడ్ ఫోర్‌హ్యాండ్ షాట్ కూడా ఆడగలడు.
--నాదల్ అందుకొన్న ప్రతి ట్రోఫీని కొరుకుతాడు. అది తనకు తెలియకుండానే అలవాటైపోయిందని అంటాడు.
--ఫ్రెంచి ఓపెన్ ఆడే సమయంలో రఫెల్.. లాకర్ నంబర్ 159 మాత్రమే తీసుకొంటాడు.
--ప్రతి మ్యాచ్‌కు ముందు చన్నీటి స్నానం చేస్తాడు.
--టెన్నిస్ కోర్టులో నాదల్ తాగే వాటర్ బాటిల్స్‌ను ఓ క్రమ పద్దతిలో ఉంచి.. నీటిని తాగుతాడు.
--నాదల్‌కు చీకటంటే భయం. అతడు నిద్ర పోతున్న సమయంలో కూడా టీవీ స్క్రీన్ గానీ, బెడ్ లైట్ గానీ వెలుగుతూ ఉండాల్సిందే.
--నాదల్ ఫిట్‌నెస్ చూసి ఓ ఫ్రెంచి రాజకీయ నాయకురాలు డోపింగ్ ఆరోపణలు చేసింది. దీంతో నాదల్ పరువు నష్టం దావావేసి 11,000 డాలర్లు కట్టించాడు. ఆ మొత్తాన్ని ఫ్రాన్స్‌లోని ఓ సేవా సంస్థకు విరాళంగా ఇచ్చాడు.