అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం సుప్రీంకు పోలీసులు?

అల్లు అర్జున్ మధ్యంతర బెయిలు రద్దు కోసం హైదరాబాద్ పోలీసులు హైకోర్టుకు, ఇంకా అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఏ 11గా పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 13న అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకుని ఈ నెల 14 ఉదయమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

అసలు విషయమేంటంటే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా  ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4న జరిగిన తొక్కిసలాటలో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ11 అల్లు అర్జున్ ను పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేసి నాంపల్ల్లి కోర్టులో హాజరు పరచగా, నాంపల్లి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అయితే అదే రోజు అల్లు అర్జున్‌ క్వాష్ పిటిషన్ పై   విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు చంచల్‌గూడ జైలుకు   అందడంలో జాప్యం కారణంగా ఆయన ఒక రాత్రి జైలులో ఉండాల్సి వచ్చింది.ఆ మరుసటి రోజు అంటే  డిసెంబర్ 14  ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.   తాజాగా సేకరించిన ఆధారాల మేరకు వారు త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.    
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. థియేటర్‌ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

 మీడియా నివేదికల ప్రకారం, భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పుష్ప 2 బెనిఫిట్ షో ప్రదర్శన సమయంలో అల్లు అర్జున్ మరియు నటి రష్మిక మందన్నను థియేటర్ లోకి అనుమతించవద్దని సంధ్య థియేటర్ యాజమాన్యానికి సూచించినట్లు పోలీసులు ప్రాసిక్యూషన్, అదనపు అడ్వకేట్ జనరల్ కు లేఖ సమర్పించారు.   అల్లు అర్జున్ ను థియేటర్ లోకి అనుమతించవద్దని చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ కు రాసిన లేఖ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  ప్రీమియర్ షోకు అల్లు అర్జున్  హాజరైతే సంధ్య థియేటర్ లో జనసమూహాన్ని నియంత్రించడం కష్టమవుతుందని పోలీసులు ఆ లేఖలో పేర్కొన్నారు. అదే కారణాన్ని పేర్కొంటూ, అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని మేజిస్ట్రేట్ ను అభ్యర్థిస్తూ పోలీసులు  అప్పీల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.