ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్
posted on Dec 18, 2024 6:49PM
ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం (డిసెంబర్ 18) వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆటో డ్రైవర్ల యూనిఫారంలో అసెంబ్లీకి హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆటో నడుపుతూ అసెంబ్లీకి వెళ్లారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.
ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అలాగే ఆటో డ్రైవర్లకు రూ. 12 వేల ఆర్ధిక సహాయాన్ని అందించాలని కోరారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. లగచర్ల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం (డిసెంబర్ 17) అసెంబ్లీకి నల్ల చొక్కా లు ధరించి, చేతులకు బేడీలు వేసుకొని అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. రోజుకో సమస్యపై వినూత్న నిరసనలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం ఆసక్తి రేపుతోంది.