పోలీసులు కనిపెట్టేశారు.. సుబ్రహ్మణ్యంది హత్యేనట..ఏ1 ఎమ్మెల్సీ అనంతబాబేనట!

వైసీపీ ఎమ్మెల్యసీ అనంత ఉదయ బాస్కర్ ( అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యంది హత్యేనని పోలీసులు ఎట్టకేలకు కనిపెట్ట గలిగారు. పోస్టు మార్టం నివేదికలో సుబ్రహ్మణ్యంను కొట్టి చంపినట్లు తేలడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యంది హత్యేనని ప్రకటిస్తూ.. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు.

ఎ1గా అనంతబాబును చేర్చి హత్య కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యం మృతదేహం చూడగానే ఎవరికైరా ఆయన హత్యకు గురయ్యారని ఇట్టే అర్ధమైపోతుంది. ఘనత వహించిన పోలీసులకు మాత్రం అలా అనిపించలేదు. అందుకే అనుమానాస్పద మృతి కేసుగా తొలుత నమోదు చేశారు. హతుడి భార్య, విపక్షాలు మూడు రోజుల పాటు రాష్ట్రం మొత్తం అట్టుడికేలా ఆందోళనలు చేయడంతో ఇక తప్పదన్నట్లుగా పోలీసులు సుబ్రహ్మణ్యంది హత్యేనని ప్రకటించారు.

మామూలుగా అయితే  సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో హతుడి ఇంటి వద్దకు తీసుకువచ్చి కారును వదిలేసి వెళ్లిన రోజే ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసి ఉండాల్సింది. కానీ అధికార పార్టీ ఎమ్మెల్సీ కావడంతో పోలీసులు ఆ పని చేయలేదు. కళ్లెదుటే దర్జాగా తిరుగుతూ, వివామ కార్యక్రమాలకు హాజరౌతున్నా.. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నాడంటూ అరెస్టు చేయడానికి ముందుకు రాలేదు. చివరికి హత్య కేసుగా నమోదు చేసే సమయానికి ఎమ్మెల్సీ నిజంగానే పరారీలో ఉన్నాడు. ఆచూకీ తెలియడం లేదు గాలిస్తున్నామంటూ మరో కథారచన ప్రారంభించారు.

ఘటన జరిగిన తరువాత ఎమ్మెల్సీ తన అధికార, అంగ బలంతో బాధిత కుటుంబ సభ్యులను నోరు తెరవద్దని బెదరింపులకు దిగినా, ఆ విషయాన్ని పోలీసులకు  బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికార పక్ష ఎమ్మెల్సీ కావడంతోనే పోలీసులు  ఆయనను  అరెస్టు చేయలేదనీ, చట్టం అధికార పక్షానికి  చుట్టం అన్నట్లుగా పోలీసుల తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పరారీలో ఉన్నాడంటూ చెబుతున్న పోలీసులు ఎమ్మల్సీ అనంతబానుబు అరెస్టు విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇప్పటికే అనంతబాబు వర్గీయులు, ప్రభుత్వ పెద్దల నుంచి బాధిత కుటుంబానికి ప్రలోభాల పర్వం మొదలైంది. హతుడి భార్యకు ఆర్థిక  సాయం, ప్రభుత్వ ఉద్యోగం అంటూ హామీల మీద హామీలు గుప్పిస్తూ, సుబ్రహ్మణ్యం హత్య విషయంలో ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ కండీషన్లు పెడుతున్నారు.