సంచలనం అంటున్న కేసీఆర్.. ఆసక్తి చూపని అఖిలేష్, కేజ్రీ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు  సంచలన ప్రకటనలకు పెట్టింది పేరు. జాతీయ రాజకీయాలపై ఆయన దృష్టి మళ్లిన తరువాత.. కేంద్రం లక్ష్యంగా ఆయన వాగ్ధాటికి పదును పెంచుకుంటూ వస్తున్నారు. ఎవరు కలిసి వచ్చినా, రాకున్నా ఆయన తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. చివరకు రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టి అయినా సరే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు.. రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, అలాగే గల్వాన్ లో చైనా సైనికుల ఘర్షణలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఆయన దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకుండా దేశోద్ధారణకు బయలుదేరడం ఏమిటన్న విమర్శలను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అయితే గత హస్తిన పర్యటనకు భిన్నంగా ఈ సారి పర్యటనలో ఆయనతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కనిపించారు.యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. వీరిరువురితో వేర్వేరుగా సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ.. మేం రాజకీయ నాయకులం, రాజకీయాలు కాక ఇంకేం మాట్లాడుకుంటామంటూ తమ మధ్య ఏదో రాజకీయ ఒప్పందం కుదిరిందన్న సంకేతాలు ఇచ్చారు.

జాతీయ నేతగా తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్ము పందేరం చేయడానికి దేశ వ్యాప్తం పర్యటనకు వెళ్లడంపై విపక్షాలే కాదు, సొంత పార్టీలోనూ, ప్రజల నుంచీ విమర్శలు వస్తున్నా ఖాతరు చేయడంలేదు. తాను జాతీయ నేతగా ఎదగడం తెలంగాణకు గర్వకారణం అన్న బిల్డప్ ఇవ్వడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. ఇక హస్తినలో మీడియాతో మాట్లాడేందుకు కేసీఆర్ ఒక్కరు ఉత్సాహం చూపారు కానీ, ఆయన పక్కనే ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం నిరాసక్తంగా ఉండిపోయారు. హస్తిలో విద్యా విధానం భేష్ అన్న కేసీఆర్, తెలంగాణలోనూ ఢిల్లీ విధానాలను అమలు చేస్తామని ప్రకటించి.. కేజ్రీవాల్ ను పోగడ్తలలో ముంచెత్తారు.

ఈ సందర్భంగానే ఆయన దేశంలో సంచలనం జరగబోతోందంటూ ఓ సంచలన ప్రకటన చేసి మిన్నకున్నారు. కానీ ఆ సంచలనం ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. అది మీడియా ఊహాగానానికి వదిలేశారు. అయితే కేసీఆర్ తో భేటీ అనంతరం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మీడియాతో మాట్లాడేందుకు సుముఖత చూపలేదు. మీడియా ఆయన వెంటపడినప్పటికీ ఆయన పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. కేసీఆర్ రాజకీయ సంచలనం అంటూ ప్రకటన చేసిన సందర్భంలో ఆయన పక్కనే ఉన్న కేజ్రీవాల్ కూడా రాజకీయాల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనిని బట్టే కేసీఆర్ ఆ ఇద్దరి నేతలతో జరిపిన చర్చలలో రాజకీయంగా ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని స్పష్టమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

హస్తిన రైతులకు ఆర్థిక సహాయం అన్న ఏకైక కారణంతోనే కేజ్రీవాల్ కేసీఆర్ తో భేటీకి అంగీకరించినట్లు ఆప్ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అది వినా వాస్తవానికి రాజకీయ చర్చల కోసం కేసీఆర్ తో భేటీ కేజ్రీవాల్ కు ఏ మాత్రం ఇష్టం లేదని విస్పష్టంగా తేల్చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ కోరినా ఆయనతో సమావేశానికి కేజ్రీవాల్ నిరాకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆప్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇక సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కేవలం మొహమాటానికే కేసీఆర్ తో సమావేశమయ్యారని రాజకీయ వర్గాలలో ఓ చర్చ నడుస్తోంది. కేసీఆర్ తో అఖిలేష్ కు మొహమాటం ఏమిటన్న ప్రశ్నకు కూడా వారు సమాధానం చెబుతున్నారు. గత ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ కు కేసీఆర్ ఆర్థిక సహకారం అందించారనీ, అందుకే ఆ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ పరాజయం పాలైనా, ఆర్థిక సహకారం అందించారన్న మొహమాటంతోనే కేసీఆర్ తో అఖిలేష్ సమావేశం అయ్యారనీ వారు విశ్లేషిస్తున్నారు.

ఢిల్లీలో ఇరువురు కీలక నేతలతో భేటీ అయిన తరువాత కూడా కేసీఆర్ కు కానీ, ఆయన జాతీయ అజెండాకు కానీ ఇసుమంతైనా మద్దతు వారి నుంచి లభించకపోయినా.. కేసీఆర్ సంచలనం అంటూ చేసిన ప్రకటనపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిని ఓడించేందుకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఎప్పటి నుంచో ఓ టాక్ వినిపిస్తున్నది. ఇప్పుడు ఆయన ఆ ప్రయత్నంలోనే దేశ వ్యాప్త పర్యటనకు బయలు దేరారని పరిశీలకులు అంటున్నారు. ఆ దిశగా తన ప్రయత్నాలు సాకారం అవుతున్నట్లు కేంద్రానికి సంకేతాలు ఇవ్వడం కోసమే సంచలనం అంటూ ప్రకటన చేశారని విశ్లేషిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి విజయం నల్లేరు మీద బండి నడకే.

 కానీ ఈ విషయంలో కేసీఆర్ ఏపీ సీఎం జగన్ పై ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. గత ఎన్నికలలో ఏపీలో వైసీపీ విజయానికి అన్ని విధాలుగా సహకారం అందించిన కేసీఆర్ ఇప్పుడు ఆ రుణం తీర్చుకోమంటూ జగన్ పై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశలున్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ.   అయితే ఏపీలో జగన్ పరిస్థితి కేంద్రాన్ని కాదని ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి. అందుకే   రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ యేతర అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు అంటున్నారు. దీంతో కేసీఆర్ చేసిన సంచలనం ప్రకటన కేవలం సంచలనం కోసమే తప్ప అద్భుతాలు ఏవీ జరిగే అవకాశం లేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.