నెక్ట్స్ వికెట్ సీఎస్ జవహర్ రెడ్డేనా? ఈసీ వేటుకు వేళాయెనా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్  వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్క‌రి పై బదిలీ వేటు వేస్తూ వ‌స్తున్న. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6)  రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న స్థానంలో ర‌వికుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా   నియ‌మించింది. రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై గ‌త కొంత‌కాలంగా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల నుంచి ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాజేంద్ర‌నాథ్ రెడ్డి అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఎన్నిక‌ల్లో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాల‌ను సైతం  స‌మ‌ర్పించారు. దీంతో రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ర‌వికుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియ‌మించింది. రాజేంద్ర‌నాథ్  రెడ్డిపై బ‌దిలీ వేటు తో నెక్ట్స్ వికెట్ ఎవ‌రిద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ‌, అధికార వ‌ర్గాల్లో జోరందుకుంది.  ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పై ఈసీ బ‌దిలీ వేటు వేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. 

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికార వైసీపీ కార్య‌క‌ర్త‌లా ప‌నిచేస్తున్నార‌ని, సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌నే ఇప్ప‌టికీ ఆయ‌న పాటిస్తున్నార‌న్న విమర్శలు కూటమి నేతల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఈసీకి కూడా పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా వాలంటీర్లు, పెన్ష‌న్ల పంపిణీ విష‌యంలో సీఎస్ వ్య‌వ‌హ‌రించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ప్ర‌తీనెలా ప్ర‌భుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్నది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డంతో వారు ఎలాంటి విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. పెన్ష‌న్ దారుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా పెన్ష‌న్లు అందించాల‌ని సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ, జ‌వ‌హ‌ర్ రెడ్డి ఈసీ ఆదేశాల‌ను పెడ‌చెవిన పెట్ట‌డంతో ఏప్రిల్ నెల పెన్ష‌న్లు తీసుకొనే స‌మ‌యంలో పెన్ష‌న్ దారులు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ప‌లువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో వైసీపీ నేత‌లు ఈ వ్య‌వ‌హారాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందు ప్ర‌య‌త్నాలు చేశారు. మే నెల పెన్ష‌న్ల పంపిణీ విష‌యంలోనూ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి  స‌మ‌ర్థ‌వంతంగా ఈసీ ఆదేశాల‌ను పాటించ‌క పోవ‌టంతో పెన్ష‌న్ దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

 సీఎస్ తీరుపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెన్షనర్లు ఏమైపోయినా పరవాలేదు.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మేలు జ‌ర‌గాల‌ని సీఎస్ వ్య‌వ‌హ‌రించార‌ని టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశారు. పెన్ష‌న్ పంపిణీ విష‌యంలోనూ, వాలంటీర్ల విష‌యంలోనూ, ఇత‌ర అంశాల్లోనూ సీఎస్ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆధారాల‌తో స‌హా ఈసీకి విప‌క్ష నేత‌లు ఫిర్యాదు చేశారు. అయితే, విప‌క్షాల ఫిర్యాదుల‌పై ఈసీ విచార‌ణ చేయ‌గా సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మైన‌ట్లు తెలుస్తోంది. దీంతో నేడో, రేపో జ‌వ‌హ‌ర్ రెడ్డిపై ఈసీ బ‌దిలీ వేటు వేయ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ అధికార వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ఒక‌వేళ ఈసీ జ‌వ‌హ‌ర్ రెడ్డిపై వేటు వేయ‌కుంటే ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగే ప‌రిస్థితి ఉండ‌ద‌ని విప‌క్ష నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇలా ఉండగా ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహణపై పట్టుదలగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా పలు సందర్భాలలో  చెప్పారు. ఇప్పుడు ఎన్నికల సంఘం వరుసగా అధికారులపై బదిలీ వేటు వేయడాన్ని చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. తాజాగా సోమవారం అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. అలాగే ఆయనకు ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని సీఎస్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.