జగన్ ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా వుండాల్సింది...

‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అనవసరంగా నోరు జారి తన పదవిని, పరువుని పోగొట్టుకుంటాడు. క్లైమాక్స్.లో రఘువరన్ బాల్చీ తన్నేస్తూ హీరోతో ‘‘అది చాలా గొప్ప ఇంటర్వ్యూ’’ అంటాడు. అంటే, ఒక్క ఇంటర్వ్యూ ముఖ్యమంత్రి అంత స్థాయి వున్న వ్యక్తిని పూర్తిగా పతనం అయ్యేలా చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొన్నీమధ్య నేషనల్ మీడియాకి.. ముఖ్యంగా టైమ్స్ నౌ ఎడిటర్ నవికా కుమార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సేమ్ టు సేమ్ ‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఇంటర్వ్యూ  లాంటిదే. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పదవి పోయింది.. ఈ రియాల్టీలో ముఖ్యమంత్రి పరువు పోయింది. జగన్ గెలవబోతున్నాడా.. ఓడుతున్నాడా అని అప్పటి వరకు జాతీయ స్థాయిలో గానీ, స్థానికంగా గానీ వున్న డోలాయమాన పరిస్థితికి ఆ ఇంటర్వ్యూ ఫుల్‌స్టాప్ పెట్టింది. నవికా కుమార్ అడిగిన ప్రశ్నలకు జగన్ ఇచ్చిన సమాధానాలు, హావభావాలు జగన్ ఓటమిని ఫిక్స్ చేశాయి. ఇక జగన్ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమన్న క్లారిటీ జాతీయ స్థాయిలో కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా వుండాల్సిందనే అభిప్రాయాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి. గతజలసేతు బంధనం మాదిరిగా, జరిగిపోయిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ వర్గాలు తీరిగ్గా బాధపడుతున్నాయి.

ఇకమీదట జగన్ ఏ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకూడదని వైసీపీ వర్గాలు ఫిక్సయ్యాయి. అసలే ఓటమి భయం నిలువెల్లా ఆవరించి వున్న జగన్ ఢిల్లీ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తడబడిపోతున్న పరిస్థితి. జాతీయ రాజకీయాల మీద మీ వ్యూ ఏమిటని అడిగితే, నాకు జాతీయ రాజకీయాల గురించి అంతగా తెలియదు అని సమాధానం చెప్పడం... అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా అనడం చాలా మైనస్ అయింది. అందుకే, ఎందుకొచ్చిన గొడవ.. నేషనల్ మీడియాకి దూరంగా వుంటే సరిపోతుంది కదా అని వైసీపీ వర్గాలు ఫిక్సయ్యాయి. ఏపీలో మీడియాకి జగన్ అంతట జగనే చెప్పడం తప్ప, జర్నలిస్టులు అడిగిన దానికి సమాధానం చెప్పే అలవాటు జగన్‌కి లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఇదే వ్యవహారం. మరి నేషనల్ మీడియా జర్నలిస్టులు అలా కాదు.. కోడి ఈకలు పీకినట్టు ప్రశ్నలు సంధిస్తారు. ఆ పీకుడుని తట్టుకునే పరిస్థితిలో జగన్ లేరు.

మరీ ముఖ్యంగా... బాబాయ్ హత్య గురించి, చెల్లెమ్మ షర్మిల తిరుగుబాటు గురించి ప్రశ్నలు అడిగితే మాత్రం జగన్ తడబడిపోతున్నారు. ఆయా ప్రశ్నలకు ఏ సమాధానం చెబుతున్నారో జగన్‌కే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల ప్రభుత్వం పోతే పోయింది.. ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవడం ఎందుకన్న అభిప్రాయంలో వైసీపీ వర్గాలు వున్నట్టు సమాచారం.