ఇళ్ళలో దూరి అణువణువూ వెతికిన పోలీసులు
posted on Sep 27, 2014 9:40AM
ఈమధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ‘కార్డ్ ఆన్ సెర్చ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రకారం రాత్రి వేళల్లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వందలాదిమంది పోలీసులు ఆ ప్రాంతంలోని ఇళ్ళలోకి వెళ్ళి సోదాలు చేస్తారు. ఈ సోదాల్లో అనుమానితులను, దొంగ వస్తువులను స్వాధీనం చేసుకుంటారు. తాజాగా శుక్రవారం రాత్రి బంజారాహిల్స్, జూబిలీహిల్స్ ప్రాంతాల్లో వున్న రహమత్ నగర్, కృష్ణానగర్, ఫిలింనగర్, గౌరీశంకర్ బస్తీల్లో పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్ళి తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో అక్రమ మద్యం వ్యాపారులు, పేకాటరాయుళ్ళు, గొలుసు దొంగలు, రౌడీ షీటర్లు మొత్తం 65 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లక్షన్నర నగదు, మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. పలు కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు వుండి తప్పించుకుని తిరుగుతున్నవారిని కూడా పోలీసులు పట్టుకున్నారు. నేరాల సంఖ్యను తగ్గించడమే ఈ ‘కార్డ్ ఆన్ సెర్చ్’ ప్రధాన ఉద్దేశమని పోలీసు అధికారులు చెబుతున్నారు.