కాశ్మీర్‌పై రిఫరెండం జరపాలంటున్న నవాజ్ షరీఫ్
posted on Sep 27, 2014 9:24AM
ప్రస్తుతం స్వదేశంలో ఇమ్రాన్ ఖాన్ అండ్ బ్యాచ్ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్ భారతదేశాన్ని విమర్శించడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కాశ్మీర్ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం పాకిస్తాన్‌కు చాలా చాలా కీలకమైందని ఆయన అన్నారు. కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తెలియాలంటే కాశ్మీర్‌లో ప్లెబిసైట్ (అభిప్రాయ సేకరణ) నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు అరవై సంవత్సరాల క్రితం కాశ్మీర్‌లో ప్లెబిసైట్ నిర్వహించాలని ఐక్య రాజ్య సమితి నిర్ణయించిందని, ఈనాటికీ అది జరగలేదని ఆయన అన్నారు. కాశ్మీర్ ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమలు చేయాలని అన్నారు. కాశ్మీరీలు దురాక్రమణలో ఉన్నారని కూడా నవాజ్ షరీఫ్ ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశం ఎప్పటి నుంచో ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోరుతున్న విషయం తెలిసిందే. దీని మీద కూడా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కామెంట్ చేశారు. ఐక్యరాజ్య సమితి కొత్తగా ఎవరికీ శాశ్వత సభ్యత్వం ఇవ్వరాదని, దానివల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని కూడా అన్నారు.