పోకెమాన్‌తో ప్రమాదం!

 

ఒక చిత్రమైన జంతువు మన కళ్ల ముందే గంతులు వేస్తూ కవ్విస్తూ ఉంటుంది. అలాంటి జంతువులను ఎన్ని పట్టుకుంటే అన్ని పాయింట్లు. ఇప్పుడు ప్రపంచమంతా ఇదే ఆట గురించిన చర్చ. ఎక్కడ చూసినా ‘పోకెమాన్‌ గో’ గురించే రచ్చ. ఇప్పటివరకూ వీడియో గేమ్స్ అంటే నాలుగు గోడల మధ్యా, ఓ చిన్న తెర మీద ఆడే ఆటలుగా సాగేవి. కానీ ఇప్పుడు ‘పోకెమాన్‌ గో’తో అవి నిజజీవితంలోకి చొచ్చుకువచ్చేశాయి. అయితే పిల్లల్నీ, యువతనీ ఇంతగా ఆకట్లుకుంటున్న పోకెమాన్‌ గోను చూసి పెద్దలు మాత్రం తెగ విసుక్కొంటున్నారు. వారి చిరాకుకి కారణం లేకపోలేదు మరి...

 

- నట్టింట్లో కాకుండా నడుచుకుంటూ ఆడే ఈ ఆటతో జనం ఎక్కడికి వెళ్తున్నామో చూసుకోవడం లేదన్నది ప్రధానమైన ఆరోపణ. ఆటని రిలీజ్‌ చేసి పట్టుమని పది రోజులైనా కాకముందే దీని వల్ల ప్రమాదాలబారిన పడ్డ వారి సంఖ్య వందల్లోకి చేరుకుంది. ఇక ఈ ఆటని ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండే మన దేశంలో కనుక విడుదల చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే భయంగా ఉంది.

 

- పోకెమాన్‌ కోసం వెతుకుతూ జనం ఎవరి ఇంట్లోకి వెళ్తున్నామో, ఏ హద్దులు దాటుతున్నామో కూడా గమనించుకోవడం లేదట. ముఖ్యంగా పిల్లలు కనుక ఇలా అపరిచితుల ఇళ్లలోకి ప్రవేశిస్తే, వారి రక్షణకు ఎవరు బాధ్యులు? అంటూ ప్రశ్నిస్తున్నారు నిపుణులు. ఈ విషయం మీద సాక్షాత్తూ న్యూయార్కు పోలీసు కమీషనర్‌గారు ప్రెస్‌ కాన్ఫరెన్సు పెట్టి మరీ రేవు పెట్టారు.

 

- పోకెమాన్‌ గో ఆడుతూ రోడ్డు మీదకు వచ్చినవారు, ఎదురుగుండా ఎవరు కనిపించినా.. వారిని కూడా తమ ఆటలో కలుపుకోవచ్చు. దారి దోపిడీగాళ్లు, లైంగిక నేర చరిత్ర కలిగిన వారు ఈ అంశాన్ని సాకుగా తీసుకుని అమాయకులను మోసం చేసిన కేసులు కూడా ఈపాటికే నమోదవుతున్నాయి.

 

- పోకెమాన్ గోతో మన వ్యక్తిగత భద్రత కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ఈ ఆట ద్వారా ఎవరైనా వైరస్‌ను చొప్పించి మన వ్యక్తిగత సమాచారాన్నీ, కదలికలనీ పసిగట్టేయవచ్చు. మరీ మాట్లాడితే తమకు తోచిన చోటకి మనల్ని రప్పించుకోవచ్చు.

 

- తీవ్రవాదులకు కూడా ఈ ఆటను ఒక సాకుగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. పోకెమాన్‌ను వేటాడుతున్నామని చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి ప్రవేశించేయడం, రహస్య స్థావరాలను ఫొటోలు తీయడం సాధ్యమే అంటున్నారు.

 

- పోకెమాన్‌ గోతో మానవ సంబంధాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని సైకాలజిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న బంధాలు ఈ ఆట మత్తులో మరింత మసకబారిపోతాయని హెచ్చరిస్తున్నారు. మొన్నటికి మొన్న తన భార్య పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటే పోకెమాన్ గో ఆడుతూ కూర్చున్న ఒక ప్రబుద్ధుడి ఉదంతం సోషల్‌ మీడియాలో బయటపడింది. పోకెమాన్‌ గో ధ్యాసలో పడితే తల్లిదండ్రులు, తోటివారు అన్న పట్టింపులేమీ ఇక మిగలకపోవచ్చు. చుట్టూ జనం పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోకపోవచ్చు!

 

ఇదంతా చూస్తుంటే ‘పోకెమాన్‌ ఆడేవారు తాగుబోతుల్లా ప్రవర్తిస్తున్నారు’ అని బాధపడుతున్న ఓ అరబ్ అధికారి మాటలు గుర్తుకురాక మానవు. నిజానికి పోకెమాన్‌ గోని మన దేశంలో ఇంకా విడుదల చేయలేదు. కానీ అనధికారికంగా మాత్రం ఇది ఈపాటికే మన యువత చేతుల్లోకి చేరిపోయింది. మరి మనవారు ఈ పోకెమాన్‌ మోజులో ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. ఆటని ఆటగానే చూస్తారా లేకపోతే జీవితాన్నే ఓ ఆటగా మార్చేసుకుంటారా అన్నది గమనించాలి.

 

- నిర్జర.

Related Segment News