మనసు చెప్పేది వింటే!

అనగనగా ఇద్దరు అన్నదమ్ములు. ఓ పండుగ రోజున వాళ్లిద్దరికీ వాళ్ల నాన్న ఓ రెండు బహుమతులు తీసుకువచ్చాడు. అన్నయ్యకు ఇచ్చిన బహుమతిలో ఒక పెట్టె నిండా గోళీలు ఉన్నాయి. తమ్ముడికి ఇచ్చిన బహుమతిలో ఒక పెట్టె నిండా చాక్లెట్లు ఉన్నాయి. ఆ బహుమతులను చూసి అన్నాదమ్ములు ఇద్దరూ తెగ సంతోషపడియారు. ‘నేను రేపటి నుంచి రోజుకొక చాక్లెట్‌ చొప్పున తింటాను’ అంటూ లొట్టలేశాడు తమ్ముడు. ‘నేను రేపటి నుంచి ఈ గోళీలను బడికి తీసుకువెళ్లి ఆడుకుంటాను’ అంటూ ఊరించాడు అన్నయ్య. కానీ సమయం గడిచేకొద్దీ ఇద్దరికీ చాలా భారంగా ఉంది. తమ్ముడి తపనంతా అన్నయ్య దగ్గర ఉన్న గోళీల గురించే. అన్నయ్య ఆత్రమేమో తమ్ముడి దగ్గర ఉన్న చాక్లెట్ల గురించే! అలాగని చెరిసగం పంచుకునేందుకు అన్నయ్య ఒప్పుకోలేదు.

 

మధ్యాహ్నం దాటాక తమ్ముడు నిదానంగా అన్నయ్య దగ్గరకు చేరుకున్నాడు. ‘అన్నయ్యా! ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? డాక్టరు ఎలాగూ నన్ను చాక్లెట్లు ఎక్కువ తినొద్దన్నాడు కదా! కాబట్టి నేను నీ గోళీలను తీసుకోనా. బదులుగా నా చాక్లెట్లన్నీ ఇచ్చేస్తాను,’ అన్నాడు. అన్నయ్యకు ఈ ప్రతిపాదన ఏదో బాగానే ఉన్నట్లు తోచింది. పైగా తనూ పెద్దవాడవుతున్నాడు. ఇప్పుడు గోళీలు ఆడితే చూసేవారు నవ్వుతారేమో అన్న అనుమానం తొలుస్తోంది. అదే చాక్లెట్లంటే ఎవరితోనూ పంచుకోకుండా చాటుగా గుటుక్కుమనిపించేయవచ్చు. ఇలా ఒక్క క్షణంలోనే రకరకాలుగా ఆలోచించేశాడు అన్నయ్య. చివరికి ‘సరే నీ ఇష్టం! అనేశాడు. అనుకోవడం ఆలస్యం. ఇద్దరూ తమ బహుమతులను చిటికెలో మార్చేసుకున్నారు. ఆ రోజు చీకటి పడింది. ఇంట్లో అంతా పడుకుండిపోయారు.

 

కానీ అన్నయ్యకి మాత్రం నిద్రపట్టలేదు. చీటికీమాటికీ తన జేబుని తడుముకుంటున్నాడు. అటూఇటూ కదిలి ఇంట్లోవారి వంక చూస్తున్నాడు. ఒంటిగంట, రెండు, మూడు... గడియారం పరుగులు తీస్తోంది. ఆ పిల్లవాడు తన జీవితంలో ఎన్నడూ అంతసేపు మేలుకుని ఉండలేదేమో! తెల్లారేసరికి అతని కళ్లు చింతనిప్పుల్లాగా మండుతున్నాయి. ఇక ఆ రోజు బడికి వెళ్లలేనంటూ మంచం దిగలేదు అన్నయ్య. పిల్లవాడి పరిస్థితి చూసి ఏం జరిగిందా అనుకుని కంగారుపడింది తల్లి. నిదానంగా వాడి మంచం దగ్గరకి వెళ్లి ‘ఎందుకలా ఉన్నావు! ఒంట్లో బాగోలేదా. నిద్ర ఎందుకు పట్టలేదు?’ అంటూ అడిగింది. పిల్లవాడు ఏం మాట్లాడకుండా తన జేబులోంచి ఒక గోళీ తీసి తల్లి చేతిలో పెట్టాడు. ‘ఎలాగూ నా దగ్గర ఉన్న గోళీలన్నీ ఇచ్చేస్తున్నాను కదా! ఒకటి వాడికి తెలియకుండా దాచుకుంటే ఏముంది అనుకున్నాను. వాడు కూడా ఓ చాక్లెట్‌ నాకు తెలియకుండా తిని ఉండకపోడా అనుకున్నాను. కానీ ఎందుకనో రాత్రంతా ఇదే గుర్తుకువచ్చింది. నిద్రే పట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు నీరసంగా.

 

పిల్లవాడి మాటలకు తల్లి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఆ తరువాత ‘ఈ ప్రవర్తన నీకు కొత్తకాదు కాబట్టి నీకు నిద్రపట్టడం లేదు కన్నా! కానీ మా పెద్దవాళ్లం ప్రతి సందర్భంలోనూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాము. మొదట పంచుకునే అవకాశం వచ్చినా ఒప్పుకోము. ఆ తరువాత ఇచ్చిపుచ్చుకునే అవకాశం వచ్చినా అందులో ఎలాగొలా మనమే లాభం పొందాలనే అనుకుంటాం. ఆ తొందరపాటులో ఏదో మోసం చేస్తాము. పదిపైసలు లాభపడ్డామని అనిపించినా తెగ సంతోషపడిపోతాము. కానీ ఆ సంతోషం కొద్దిసేపటిలోనే తేలిపోతుంది. దాని స్థానంలో పశ్చాత్తాపం మొదలవుతుంది. కానీ అదే తప్పుని మళ్లీ మళ్లీ చేస్తుంటాము. నిదానంగా మా మనసులని మోసానికి అలవాటు చేసుకుంటాము. నువ్వు కూడా అలా మోసం చేసేందుకే అలవాటు పడతావో లేకపోతే నీ మనసుని నిర్మలంగా ఉంచుకుంటావో నిర్ణయించుకో!’ అనేసి వెళ్లిపోయింది. పిల్లవాడు కాసేపు ఆలోచించాడు. ఆపై తన తమ్ముడికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధపడ్డాడు! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) 

- నిర్జర.

Related Segment News