ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. సిట్ స్పీడ్ మామూలుగా లేదుగా?
posted on Dec 25, 2025 12:20AM
.webp)
రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణ గురువారం (డిసెంబర్ 25) అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు 14 రోజుల కస్టోడియల్ విచారణ గురువారం (డిసెంబర్ 25)తో ముగిసింది. ఈ నేపథ్యంలో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకరరావు కస్టడీ గడువు ముగుస్తున్న రోజే కేసులోని కీలక నిందితులందరినీ ఒకేసారి విచారించేందుకు సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచారు.
మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగరావు, మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావుతో పాటు మరికొందరిని కూడా సిట్ విచారణకు పిలిచింది. ప్రభాకరరావు కస్టడీ గడువు ముగిసే చివరి రోజున సిట్ ఒకే సారి వీరందరినీ విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందరినీ కలిపి ఒకేసారి ప్రశ్నించి కీలక అంశాలపై సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
14 రోజుల కస్టోడియల్ విచారణలో ప్రభాకరణావు చాలా వరకూ ప్రశ్నలన్నిటికీ నో అనే సమాధానాలే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌లుగా పనిచేసిన నవీన్‌చంద్, అనిల్ పేర్లను ప్రస్తావించినప్పటికీ, ఆరు వేల ఫోన్ నంబర్లు ఉన్న పెన్‌డ్రైవ్ విషయంపై ప్రభాకర్‌రావు మౌనం వహించినట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, మావోయిస్టుల అంశంపైనే మాజీ మంత్రి హరీష్‌రావు తనతో మాట్లాడినట్టు చెప్పిన ప్రభాకర్‌రావు, తనకు అప్పటి సీఎం కేసీఆర్ రీ-ఎంప్లాయిమెంట్‌ను ఎలా ఇచ్చారన్న విషయంపై మాత్రం స్పందించలేదని సమాచారం.
ఇలా ఉండగా, రెండు రోజుల క్రితమే ప్రణీత్‌రావు, ప్రభాకర్‌రావులను కలిపి సిట్ విచారించింది. ప్రణీత్‌రావును దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన అధికారులు, ఇవాళ ఆయన మినహా మిగిలిన నిందితులందరినీ విచారించారు. అలాగే ప్రభాకర్‌రావు పెద్ద కుమారుడు నిశాంత్‌రావును సైతం నాలుగు గంటల పాటు విచారించిన సిట్, ఆయన ఆర్థిక లావాదేవీలపై వాంగ్మూలం నమోదు చేసింది.
ఈ కేసుకు అనుబంధంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా సిట్ దృష్టి సారించింది. దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్‌ను విచారణకు పిలిచి, ఫామ్‌హౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన ఎలా వెలుగులోకి వచ్చిందనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించింది. తన ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు ఎలా బయటకు వచ్చాయన్న విషయంపై తనను సిట్ ప్రశ్నించిందని నందకుమార్ వెల్లడించారు. అప్పుడే తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందన్న అనుమానం వచ్చినట్టు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ సిట్‌కు సమర్పించినట్టు తెలిపారు.
మరోవైపు, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను మరోసారి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, కస్టోడియల్ ఎంక్వైరీలో వచ్చిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను శుక్రవారం (డిసెంబర్ 26) సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు సిట్ సన్నాహాలు చేస్తోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు నోటీసుల అంశంపైనా కీలక చర్చ జరుగుతోంది.
అదేవిధంగా, బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులను విచా రిస్తున్న సిట్, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, మాజీ డీజీపీ స్థాయి అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇవాళ్టితో ప్రభాకర్‌రావు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో, ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయ, అధికార వర్గాల్లో నెలకొంది.