అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
posted on Dec 26, 2025 10:35AM

హైదరాబాద్ నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను పిల్లల ముందే పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త, అడ్డుకోవడానికి ప్రయత్నించిన కూతురిని కూడా మంటల్లోకి తోసి పారిపోయాడు.
నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేష్–త్రివేణి దంపతులు ప్రేమ వివాహం చేసుకుని నల్లకుంటలో తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త వెంకటేష్ అనుమానంతో వేధిస్తున్నాడని త్రివేణి ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక నుంచి మారతానని నమ్మించి కొద్ది రోజుల క్రితమే వెంకటేష్ ఆమెను తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు.
అయితే, అనుమానం మళ్లీ తలెత్తడంతో వెంకటేష్ త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురిని కూడా మంటల్లోకి తోసివేయడంతో తీవ్ర కలకలం రేగింది. బాధితుల అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే త్రివేణి మృతి చెందగా, కూతురు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.