పెట్రోల్ బంక్ లోకి దూసుకు వెళ్లిన ఓమ్ని వ్యాన్
posted on Dec 26, 2025 2:25PM

మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ అన్నోజిగూడ ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న ఓ ఓమ్ని వ్యాన్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో వాహనం మంటల్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు భయపడిపోయి వెంటనే కిందకు దిగి పరుగులు తీశారు.
అయితే, మంటలు అంటుకున్న సమయంలో డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అదుపు తప్పిన ఓమ్ని వ్యాన్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వైపు దూసుకెళ్లింది. మంటలతో వస్తున్న వాహనాన్ని గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై నీళ్ళు, అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వారి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ ఘటనతో పెట్రోల్ బంక్ సిబ్బంది, వాహన దారులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతు లకు గురయ్యారు.
కొద్దిసేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాను పెట్రోల్ బంకులోకి దూసుకు వస్తున్న సమయంలో అక్కడ పనిచేసే సిబ్బంది అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని లేనిచో ఊహకందని ప్రమాదం జరిగేదని స్థానికులు అంటూ.... పెట్రోల్ బంక్ సిబ్బందిని అభినం దించారు.