రాజమహేంద్రవరంలో ఫార్మాసిస్ట్ ఆత్మహత్యా యత్నం.. లైంగిక వేధింపులే కారణం!
posted on Mar 26, 2025 1:07PM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫార్మ్ డి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్ విభాగంలో పని చేస్తున్న అంజలి అనే ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ దీపక్ లైంగిక వేధింపులకు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నానంటూ అంజలి రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ దీపక్ తనను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు అంజలి పేర్కొంది.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లికి చెందిన అంజలి అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ అంజలి బంధువులు, విద్యార్థులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. దీపక్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు వచ్చి పరిస్థితి అదుపు చేశారు. అంజలి తండ్రి దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజమహేంద్రవరం, రాజానగరం ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్దకు వచ్చి అంజలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు.