ప్రజల వద్దకు తెలుగుదేశం నుంచి.. ప్రజలే తెలుగుదేశం చెంతకు.. బాబు అరెస్టుతో మారిపోయిన పరిస్థితి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రజలలోకి వెళ్లకుండా నిలువరించడమే లక్ష్యంగా జగన్ పన్నిన వ్యూహం ఫలించిందా? వికటించిందా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి మాత్రం పూర్తిగా బెడిసికొట్టిందన్న సమాధానమే వస్తున్నది. జగన్ ఇప్పుడేమిటి? రెండేళ్ల కిందటే తన పార్టీపై, ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను గ్రహించారు. అందుకే డైవర్షన్ స్కీమ్ లో భాగంగా వైనాట్ 175 అన్న నినాదాన్ని ఎత్తుకుని ప్రజలలో కాకపోయినా.. పార్టీ శ్రేణుల్లోనైనా ఏదో మేరకు ఉత్సాహాన్ని నింపాలని భావించారు.

అందుకు అనుగుణంగానే సమయం, సందర్భం లేకుండా, పార్టీ కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమమా అన్న విచక్షణ కూడా లేకుండా మైకు పట్టుకున్న ప్రతి సారీ.. పరనింద, ఆత్మస్థుతి అజెండాగా అవు కథ కాలంటి ప్రసంగాలు చేస్తూ.. వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు జగన్ ఆ వైనాట్ 175 నినాదాన్ని ప్రజలు తెలుగుదేశం కు మద్దదుగా నినదిస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. అన్నిటికీ మించి పార్టీ  పరంగా గడపగడపకు మన ప్రభుత్వం, బస్సు యాత్ర, వైఏపీ నీడ్స్ జగన్ అంటూ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలే జనంలోకి వెళ్ల లేని పరిస్థితి ఉండటంతో  అవన్నీ విఫలమయ్యాయి. జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం అయితే ఘోరంగా విఫలమైంది. ప్రజల వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజాగ్రహ సెగ తగిలి విలవిలలాడిపోయారు. దీంతో చాలా మంది అసలా కార్యక్రమంలో పాల్గొనకుండానే మమ అనిపించేశారు.

దీనిపై జగన్ పలు మార్లు సమీక్ష చేసి.. గడపగడపకూ కార్యక్రమాన్ని  నిర్లక్ష్యం చేసిన వారికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరికలు కూడా  చేశారు. అయితే ఆయన హెచ్చరికలను పార్టీ నేతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. టికెట్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మరీ మంచిది అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో తత్వం బోధపడిన సీఎం.. ఇక గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టించుకోవడమే మానేశారు. తాను ఎటూ పరదాలు లేకుండా తాడెపల్లి ప్యాలెస్ నుంచి అడుగుపెట్టరు.. యధా రాజా తథా ప్రజ అన్నట్లుగా జగన్ ను చూసి పార్టీ నేతలు కూడా జనం మొహం చూడటం మానేశారు. కేవలం బటన్ నొక్కితే చాలు అన్నీ సర్దుకుంటాయన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు.

అయితే ప్రజలలో పెల్లుబుకుతున్న వ్యతిరేకత విపక్ష నేత చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న జనసందోహం రూపంలో కనిపించడంతో.. తానెటూ జనంలోకి వెళ్లను.. విపక్షాలను ఎందుకు వెళ్ల నివ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. కోర్టులలో కేసులను ఎలా సాగదీయాలన్న విషయంలో దిట్ట అయిన జగన్.. చంద్రబాబు అరెస్టు తరువాత ఆయనను 40 రోజులుగా నిర్బంధంలో ఉంచేందుకు తనకు బాగా తెలిసిన సాగదీత నే నమ్ముకున్నారు. దీంతో చంద్రబాబు ప్రజల మధ్యకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అంతే కాదు.. అశేష ప్రజాదరణతో  నిరాటంకంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. మొత్తం తెలుగుదేశం శ్రేణులన్నీ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలకే పరిమితమయ్యారు. కీలక నేతలంగా రాజమహేంద్రవరం, హస్తిన, బెజవాడ కే పరిమితమైపోయారు.  చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ రాష్ట్రంలో  ఎక్కడ చూసినా తెలుగుదేశం కార్యక్రమాలే.  బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ , ఇదేం ఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలతో  జగన్ పార్టీ కాళ్ల కింద నేల కదిలిపోతోందా అనిపించేలా పరిస్థితి ఉండేది. అయితే అరెస్టు తరువాత ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు అరెస్టుతో ఆవేదనలో పడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటాలు లేవు, ఆందోళనలు లేవు.  అంతా  చంద్రబాబు విడుదల కోసం ఎదురు చూస్తూ.. సుదీర్ఘంగా సాగుతున్న కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో కావడానికే పరిమితమయ్యారు.

దీంతో జగన్ పార్టీ నేతలు తమ వ్యూహం ఫలించిందని సంబరాలు చేసుకోవాలి. కానీ రాష్ట్రంలో, దేశంలో చివరకు విదేశాలలో సైతం జనం స్వచ్ఛందంగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రోడ్ల మీదకు వస్తుండటంతో .. చంద్రబాబు అరెస్టుతో జగన్ స్వయంగా తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ రాష్ట్రంలో తటస్థులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉండేవారనీ, అయితే ఎప్పుడైతే జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందో.. ఆ క్షణం నుంచీ తటస్థులంతా తెలుగుదేశం పక్షానికి చేరిపోయారనీ సోదాహరణంగా చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో జగన్ దిద్దుకోలేని తప్పు చేశారనీ, దాని  ఫలితం వచ్చే ఎన్నికల్లో పరాజయం రూపంలో అనుభవించక తప్పదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.