అప్పుడు వినబడలేదా.. సిగ్గనిపించలేదా?

‘చెప్పు చూపిస్తూ.. దారుణమైన బూతులు మాట్లాడే నాయకులు మనకు అవసరమా?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీఎం జగన్ ప్రశ్నించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిషేధిత భూముల జాబితా నుంచి షరతు గల పట్టా భూముల తొలగింపు కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన జగన్ ‘వీధి రౌడీలు కూడా అలా మాట్లాడతారో లేదో నాకు తెలీదు. నాయకులుగా చెప్పకుంటున్న వారు  బహిరంగంగా చెప్పులు చూపిస్తూ.. దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు నాయకులా?’ అంటూ జగన్ తెగ బాధపడిపోయారు. ‘దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేం మాట్లాడిస్తున్నారో అంతా చూస్తున్నాం. మూడు రాజధానులతో అందరికీ మేలు కలుగుతుందని మనం చెబుతుంటే.. మూడు పెళ్లిళ్లతో అభివృద్ధి జరుగుతుంది.. మీరూ చేసుకోండని నాయకులుగా చెప్పుకుంటున్న వారు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే మహిళల పరిస్థితి ఏంటి? ఒక్కొక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా? దీనిపై ప్రజలంతా ఆలోచించాలి’ అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడి పేర్లు నేరుగా ప్రస్తావించకుండా జగన్ విమర్శలు గుప్పించారు. వారి తీరు పట్ల ఆవేదన ఒలకబోశారు. ఇలాంటి నాయకుల్ని చూసి విరక్తి కలుగుతోందని నిర్వేదం వ్యక్తం చేశారు.

నిజమే.. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అన్నట్లు.. ఈ బూతుల పంచాంగం ముందుగా మొదలెట్టింది ఎవరు మహాశయా..? అంటూ జనం జగన్ ను నిలదీస్తున్నారు.  జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పని చేసిన కొడాలి నాని అన్నేసి బూతులు మాట్లాడి.. బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నప్పుడు మీకు ఆయన బూతులు వినిపించలేదా  జగన్ రెడ్డీ అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. చెప్పు చూపించినందుకు.. వైసీపీ కొడకల్లారా? అన్నందుకే జగన్ కు అంతటి నొప్పి కలిగితే. . కొడాలి నాని నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేసినప్పుడు మీకు చెవులు పనిచేయలేదా? కళ్లు కనిపించలేదా? అప్పుడెందుకు ఇంత నొప్పి, ఆవేదన కలగలేదని నిలదీస్తున్నారు. కొడాలి మాట్లాడితే.. రైటు.. పవన్ నోట వస్తే బూతుగా అయ్యిందా? అంటున్నారు.

ఆనాడు.. ఏకంగా నిండు అసెంబ్లీలోనే.. మీ పార్టీ ఎమ్మెల్యే రోజా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ‘కామ సీఎం’ అంటే సభలోనే ఉండి ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు బూతుల బాధ మీకు రాలేదేం అని అంటున్నారు. మీ ఎమ్మెల్యే బూతు మాట్లాడితే ఒప్పు.. ఇతరులు అంటే  తప్పు అని ముల్లు గుచ్చుకుందా? అని సూటిగా అడుగుతున్నారు. టీడీపీ బీఫాంపై గెలిచి, మీ పంచన చేరిన వల్లభనేని వంశీ.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి సతీమణిపై   అసందర్భ ప్రేలాపనలు పేలితే.. కనీసం ఖండించని మీరు ఇప్పుడు కడుపు మండి పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని తప్పు పట్టడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.  ఏం.. తనను ‘ప్యాకేజ్ స్టార్’ అని మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి రోజూ విమర్శలు చేస్తుంటే.. వద్దని వారించకుండా చోద్యం చూసిన మీరు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలతో ఇంతలా బాధపడిపోవడంలో అర్థం ఉందా? అని నిలదీస్తున్నారు.

గతంలో విశాఖ శారదాపీఠానికి మీరు వెళ్లినప్పుడు.. తనను లోపలికి పంపించలేదని మీ కేబినెట్ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసులను నోటికొచ్చిన విధంగా  బూతులు తిట్టినప్పుడు మీకు ముల్లు గుచ్చుకోలేదేమని అంటున్నారు. కొడకల్లారా అని పవన్ అంటే ఇంతలా స్పందిస్తున్న మీకు మీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధ్యక్షుడ్ని ఉద్దేశిం ‘నిన్నెవరైనా గ్యాంగ్ రేప్ చేశారా?’ అన్నప్పుడు మీ చెవులకు  పని చేయలేదా అని నిలదీస్తున్నారు.  గతంలో మీ కేబినెట్ లో ఉన్నప్పుడు ప్రతిరోజూ మీడియా ముందు చొక్కా మడతపెట్టి, తొడ కొట్టి మరీ ప్రతిపక్ష నేతలపై వీధి రౌడీలా అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిల్ కుమార్ యాదవ్ మాటలు మీకు అనకూడని మాటలు అనిపించలేదా? అంటున్నారు. ఇప్పుడు పవన్ మాటలు వీధి రౌడీలు కూడా మాట్లాడతారో లేదో అనే అనుమానం కలుగుతోందా? జగన్ రెడ్డీ అని నిలదీస్తున్నారు.

మీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన, ఆయన సతీమణిపైన అసెంబ్లీ వేదికగానే మూకుమ్మడిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే.. అప్పుడెందుకు మీరు స్పందించలేదని జనం ప్రశ్నిస్తున్నారు. అంతలేసి మాటలు తనను అంటుంటే తీవ్ర మానసిక ఆవేదన చెందిన చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా మీ సభ్యుల మాటలు తప్పు అని ఖండించని మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలపై స్పందించే అర్హత ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తున్నారు.