వణికి చస్తున్న పెద్దిరెడ్డి.. కాషాయ రక్షణ కోసం అర్రులు?!

వైసీపీ ప్ర‌భుత్వంలో చ‌క్రంతిప్పిన నేత‌ల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత‌ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఒక‌రు. ఐదేళ్ల కాలంలో రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి ఏం చెబితే అధికారులు అది శాస‌నంగా భావించి చేశారు. ఇందు కోసం నిబంధనలు, నియమాలు, మంచీ, చెడూ అన్నీ పక్కన పెట్టేశారు. తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో , కనుసైగ ఆదేశాలతో అనేక‌ సార్లు దాడులు జ‌రిగాయి. కొంద‌రు పోలీసులు అతిగా ప్ర‌వ‌ర్తించి తెలుగుదేశం నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టి ఇబ్బందుల‌కు గురిచేశారు. దీనికితోడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంను టార్గెట్ చేశారు.  కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు అడుగుపెట్ట‌కుండా చేసేందుకు ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించారు. పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని బాబుపై దాడుల‌కు సైతం ప్ర‌య‌త్నాలు చేశారు. కుప్పంలో చంద్ర‌బాబును ఓడిస్తామ‌ని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌వాళ్లు  చేశారు.  సీన్ రివ‌ర్స్ అయ్యింది. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు ఓటు ద్వారా వైసీపీ ప్ర‌భుత్వానికి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, పెద్దిరెడ్డితో పాటు మ‌రో తొమ్మిది మంది మొత్తం 11 మంది మాత్రమే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. అధికారంలో ఉన్న‌న్ని రోజులు పోలీసుల స‌హాయంతో విర్ర‌వీగిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న గ్యాంగ్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు వ‌ణికిపో తున్నారు.

తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన కొద్దిరోజుల‌కే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతోపాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. దీంతో పుంగనూరు మున్సిపల్ కార్యాలయంపై తెలుగుదేశం జెండా రెపరెపలాడనుంది. మొత్తం 31 మంది సభ్యులున్న ఈ మున్సిపాలిటీలో  మరి కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. క్యాడ‌ర్ చేజారుతున్న క్ర‌మంలో పెద్దిరెడ్డికి తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం మ‌రో బిగ్ షాకిచ్చింది. ఆయ‌న సెక్యూరిటీని త‌గ్గించింది. గ‌తంలో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం 5ప్ల‌స్5 సెక్యూరిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉండ‌టంతో 1ప్ల‌స్1 సెక్యూరిటీ మాత్ర‌మే ఇస్తామ‌ని చెప్పింది. పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డికి గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం ఉండ‌టంతో 4ప్ల‌స్4  సెక్యూరిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం కేవ‌లం ఎంపీగా ఉండ‌టంతో అందుకు త‌గిన భ‌ద్ర‌త‌ను ప్ర‌భుత్వం క‌ల్పించ‌నుంది. దీంతో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి తమకు భద్రత పెంచాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

తమకు ఎలాంటి సమాచారం లేకుండా హడావిడిగా సెక్యూరిటీ తొలగించారని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కోరింది. చట్టపరమైన నిబంధనల ప్రకారమే వారికి భద్రత కల్పిస్తామని ప్ర‌భుత్వం తేల్చిచెప్పేసింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం జులై 8కి వాయిదా వేసింది. దీనికితోడు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు శాఖ‌ల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా, పంచాయతీ రాజ్ మంత్రిగా ప‌నిచేశారు. ఇసుక, గ‌నుల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ప్ర‌భుత్వం  పెద్దిరెడ్డి శాఖ‌ల‌పై గురిపెట్టింది. శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. అక్ర‌మాలు వెలుగులోకి వ‌స్తే జైలుకెళ్లే అవ‌కాశాలు లేక‌పోలేదు. దీంతో ప్ర‌భుత్వం టార్గెట్ నుంచి త‌ప్పించుకునేందుకు పెద్దిరెడ్డి, ఆయ‌న కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేకుంటున్న‌ట్లు స‌మాచారం. కాషాయం కప్పుకుంటే రక్షణ లభిస్తుందన్న ఆశతో బీజేపీ కరుణా కటాక్ష వీక్షణాల  కోసం అర్రులు చాస్తున్నారు. 

ఏపీ బీజేపీ నేత‌ల్లో కొంద‌రు మొద‌టి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉంటూ వ‌స్తున్నారు. దీంతో వీరి ద్వారా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం వీరిని పార్టీలోకి చేర్చుకునేందుకు సుముఖ‌త చూప‌డం లేద‌ని స‌మాచారం. ఎన్డీయే ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు కీల‌కంగా ఉన్నారు. చంద్ర‌బాబును కాద‌ని వైసీపీ నేత‌ల‌ను బీజేపీలోకి తీసుకుంటే ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉంటాయ‌ని కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. దీంతో ప్ర‌స్తుతానికి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు బీజేపీలోకి వెళ్లే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌ను ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యంతో వణికిపోతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.