పంచె కట్టుకొచ్చాడు... పంచ్‌లు వేయలేదు
posted on Nov 13, 2015 9:09AM

కథానాయకుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని గురువారం నాడు విజయవాడలో కలవటం, రెండు గంటలకు పైగా ఆయనతో భేటీ కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ముఖ్యంగా మీడియాకి బాగా ఫుడ్డు దొరికింది. వీళ్ళ భేటీనే ఒక ముఖ్యమైన అంశం అయితే, ఈ భేటికి పవన్ కళ్యాణ్ ఫుల్ గ్లామర్‌తో అది కూడా తెలుగు సంప్రదాయానికి ప్రతీక అయిన పంచెకట్టుతో రావడం ఈ అంశానికి మరింత గ్లామర్ని చేకూర్చింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించిన మీటింగ్స్‌లో పాల్గొనడానికి వచ్చినప్పుడు బారుగా పెరిగిన గడ్డంతో, గజిబిజిగా వున్న బట్టలతో డీ గ్లామర్‌గా కనిపించేవాడు. అయితే చంద్రాబాబుతో భేటీకి మాత్రం ఫుల్ గ్లామర్‌గా, పంచెకట్టుతో రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మొన్నామధ్య అమరావతి ప్రాంత రైతులను కలవటానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడి, ప్రభుత్వం మీద పంచ్‌లు వేశాడు. ఆయితే ఆ మర్నాడు నాలుక్కరుచుకుని వివరణలు ఇచ్చుకున్నాడు అది వేరేసంగతి. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అయి బయటకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏవైనా పంచ్‌లు వేసి హాట్ హాట్ వాతావరణం సృష్టిస్తారేమోనని చాలామంది అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పంచె అయితే కట్టుకుని వచ్చాడుగానీ, పంచ్‌లు మాత్రం వేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో చాలా సానుకూల ధోరణితో వున్నట్టు మాట్లాడాడు. ఈ ధోరణిని చూస్తుంటే పవన్ కళ్యాణ్‌లో రాజకీయ పరిపక్వత పెరుగుతున్నట్టే వుందన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.