పదిహేనేళ్ల పాటు బాబే సీఎం..నేనే డిప్యూటీ.. తేల్చేసిన పవన్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలనా పరంగా ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ జనరంజకంగా పాలన సాగిస్తోంది. పాలనా పరంగా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులూ లేకపోయినా, కూటమి పార్టీలలో సఖ్యత విషయంలో అనుమానాలు పొడసూపుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనల మధ్య అగాధం ఏర్పడిందన్న అనుమానాలు పొడసూపుతున్నాయి. ఈ విషయమై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్యా విభేదాలు ఉన్నాయని జనం భావించే లక్ష్యంతో వైసీపీ మీడియా ఈ ప్రచారం సాగిస్తోందని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ ప్రచారాన్నిఖండిస్తున్నాయి. అయినా కూడా అనుమానాలు పూర్తిగా నివృత్తి కాని పరిస్థితి ఉంది.

తాజాగా ఇటీవల పిఠాపురం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేనాని పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలు అభూతకల్పనలేనని పవన్ కల్యాణ్ తేల్చేశారు. అది కూడా జనసేన, తెలుగుదేశం ఎమ్మెల్యేల సమక్షంలో చంద్రబాబును పక్కన పెట్టుకుని తమ రెండు పార్టీల మధ్యా ఎలాంటి పొరపొచ్చాలూ లేవని విస్ఫష్టంగా చెప్పాశారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం (మార్చి 20) ముగిశాయి. సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలు కూడా అదే రోజు ముగిశాయి. ఈ సందర్భంగా  విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ప్రజాప్రతినిథుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వీటిని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తిలకించారు. అనంతరం మాట్లాడిన పవన్ కల్యాణ్ తెలుగుదేశం, జనసేనల బంధం సుదీర్ఘ కాలం కొనసాగుతుందని విస్పష్టంగా చెప్పారు. దేశానికి నరేంద్ర మోడీ వరుసగా మూడో సారి ప్రధాని అయ్యారనీ, అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటారనీ పవన్ కల్యాణ్ అన్నారు. అంటే చంద్రబాబు 15 ఏళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటారనీ, ఈ 15ఏళ్లూ తానే ఉపముఖ్యమంత్రిగా ఉంటాననీ పవన్ కల్యాణ్ చెప్పారు.

కూటమి సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉంటుందనీ, అంత కాలం తెలుగుదేశం అధినేత చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారనీ, తాను ఉప ముఖ్యమంత్రిగా ఆయన కింద పని చేస్తాననీ పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన ఈ మాటలు చెబుతున్న సమయంలో చంద్రబాబు సహా తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలు ఆయన వైపే చూస్తు ఉండిపోయారు.  ఈ మాటలతో తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు పొడసూపాయంటూ జరుగుతున్న ప్రచారానికి పవన్ కల్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. చంద్రబాబు పని తీరుకు, ఆయన విజ్ణతకు, దార్శనికతకు తాను అభిమాననని, రాష్ట్రప్రగతి విషయంలో ఆయన చిత్తశుద్ధిపై తనకు పూర్తి విశ్వాసం ఉందనీ పవన్ కల్యాణ్  చెప్పడం ద్వారా తెలుగుదేశంతో జనసేన పొత్తు సుదీర్ఘ కాలం సాగుతుందని తేటతెల్లం చేసేశారు.