శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం.. ఆ విషయం ఆయనకు తెలుసా అరవిందా?

 

(శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం ఉంది.. ధర్మపురి అరవింద్)

మొన్నామధ్య  వూరి పెద్ద బస్టాండ్‌లో మిట్టమధ్యాన్నం కాషాయ దుస్తుల్లో ఒకాయన బస్సుదిగాడు. మెల్లగా చెట్టు నీడలోకి వచ్చి సోడా తాగి బెంచీ మీద కూచున్నాడు. అప్పటిదాకా కాగితంతో ఆడుతున్న కుక్కపిల్లతో సహా అక్కడ బెంచీల మీద కూచున్నాళ్లంతా ఆయన్నే చూస్తుండిపోయారు. 
ఓ అరగంట తర్వాత బస్సు క్లీనర్‌ దగ్గరగా వెళ్లి పలకరించాడు..‘సామీ ఎవరు మీరు? ఇక్కడ ఎవరు కావాల?’ అని. చిన్న గడ్డం సవరించుకుంటూ ‘నర్సిమ్మ కొట్టుకెల్లి   బీడీకట్టట్టుకురారా అంటూ ఆ స్వామి ఆదేశించాడు. అంతే ఆయన మాటతీరు  బాగా దగ్గరగా చూసిన ఆ కుర్రాడు.. ఒరేయ్‌  ఈడు సాములోరు గాదురా.. మన  సత్తిగాడు అని గావుకేక వేశాడు. ఏదో వజ్రాన్ని కనుగొన్నట్టు బస్టాండ్‌ అంతా పరిగెడుతూ అందరికీ స్వామి అసలు పేరుతో సహా ప్రకటించాడు. అంతే వీలయినంతమంది సత్తి చుట్టూ చేరి  అయినా ఇదేం యాశంరా ’ అంటూ ప్రేమగానే తిట్టారు. 

సదరు స్వామి నవ్వి,  వేషం మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. వీధిపేరు, ఊళ్లో బావిపేరు, మున్సిపల్‌ స్కూలు పేరు.. ఇలా అన్నీ  మార్చేస్తున్నారు. నన్నూ మారుస్తారని  ముందుగా నేనే మారిపోయాను. ఎవరో మనల్ని మార్చడం కన్నా మనకు మనము మారడం ఉత్తమం కదా  అన్నాడు స్వామి సత్తి.
అందరూ తలగోక్కున్నారు. వీడిలానే వీడి మాటా అర్దమై చావదు, ఏం చెబుతున్నావో సరింగజెప్పరా పిచ్చి సన్నాసీ  అని అరిచింది అరటిపళ్లు అమ్మే ముసలామె. గొంతు సవరించుకుని సత్తి సామి..  అంతా రామమయం  అంటే కేవలం సినిమాలో ఎస్పీ గొంతు చించుకున్న పాటే అనుకున్నామా, కానీ  అది అంతటితో ఆగలేదు, అంతా రామమయం అంటే అంతటా, అన్నింటా రామమయం చేయాలని కొందరు కాషాయాలు బిగించారు. మీకింకా ఆ సంగతి తెలియలేదు. తెలిసేప్పటికీ మీ ఇళ్ల పేర్లన్నీ రాముడితో, కృష్ణుడితో నిండిపోతాయి నాయనలారా  అంటూ జ్ణానబోధ చేశాడు స్వామి సత్తి.  అదెట్టా? అడిగారు కొందరు.

దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఆ మాతను మనసులో నిలుపుకుని అంతే పద్దతిలో మనం నడచుకోవాలి అని  ఏలికలు నువ్వూ నేనూ చూడని పాతతరం సీనియర్‌ నాయకుల స్ఫూర్తితో, భక్తి రసం తలకెక్కించుకుని రైల్లో, విమానాల్లో బయలుదేరి వీలయినన్ని ప్రాంతాలు, భవనాలు, కూడళ్లు, గ్రామాల పేర్లు అమాంతం మార్చేస్తున్నారు. అదో దండు. లోకంలో వారిని మించిన రామభక్తులు ఉండటం అసాధ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీ యింట్లో పెద్దతరం వారూ వీళ్ల ముందు బలాదూర్‌. బతికిబట్టకట్టమంటూ ఇచ్చే కార్డు ముక్క కూడా స్వయంగా రాములవారి భిక్షట. ఏలిక స్వయంగా రామభక్తుడు. అందువల్ల ప్రజలంతా చచ్చినట్టు రామసంకీర్తనతోనే కార్యాలయాల్లో, బడిలో కాలం గడపాలేగాని వేరే లోకం ఉండకూడదు.  అలాగాకుంటే ఆంజనేయులవారికి చెడ్డ కోపం వస్తుందని, కండల మీద బొమ్మలు వేసుకున్న వస్తాదులు ఊరూరా తిరుగుతున్నారు.ఈ భక్తి పారవశ్యంలో వీలయినన్ని ఊళ్లు, బజార్లు, బస్టాండ్ల పేర్లు మారుస్తూ పోతున్నారు. అలవాటులో పొరపాటుగా నా పేరూ మార్చేస్తారేమోనని ముందు జాగ్రత్తకోసం కాషాయం ధరించా. 

ఇంతలో ఎవరో సైకిల్‌ మీద పోతూ ‘జై శ్రీరామ్‌!’ అని అరుస్తూ వెళ్లాడు.   కొంత దూరం వెళ్లి ఆగి మళ్లీ  వెనక్కి వచ్చి అటుగా సిగెరెట్టు తాగుతూ వెళుతోన్న కుర్రాడిని అడ్డగించాడు. నీకు దేశభక్తి లేకపోతే ఎలాగయ్యా.. ఏలిక దేశ ప్రగతి కోసం  సంస్కృతిని కాపాడేందుకు ఎంత చమటోడుస్తున్నాడు.. జైశ్రీరామ్‌ అను ఆయనకు ఉపశమనం కలుగుతుంది అన్నాడు.  ఛస్తే అన్ను.. ఆయనకు దురదేస్తే.. నేను గోక్కోడం ఏమిటయ్యా బుద్ధుందా?’ అని ఎదురు తిరిగాడు.. అంతే ఓ అరగంట అలా గొంతు చించుకున్నారు. ఆనక అలసిపోయి విడిపోయారు. 

రాములవారికీ పార్టీ సభ్యత్వం అంటగట్టినవారు దేశాన్ని ఒకే రంగు పులిమి ఓట్లు గుద్దించుకోవడమనే వారి భవిష్యత్‌ ప్రణాళిక. డబ్బు చేసినవాడికి జబ్బో లెక్కా.. రాముడిని ఎలాగయినా వాడుకోవచ్చని నిర్ధారించుకున్నాక కౌసల్య రూపంలో ఎవరు గుండెలు బాదుకున్నా ఏమీ కాదు..!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu