బీహార్ లో కాంగ్రెస్ జీరో కానుందా?
posted on Jan 17, 2026 8:41AM

బీహార్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి జేడీయూ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై వారీ పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్ ఖండించింది.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 'దహీ-చూరా' విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు. దీనికి తోడు సంక్రాంతి తరువాత కాంగ్రెస్ లో పెద్ద కుదుపు ఉంటుందంటూ ఎన్డీయే నేతల ప్రచారం కూడా కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జనతాదళ్ గూటికి చేరనున్నారన్న ప్రచారానికి ఊతం ఇచ్చింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఆరుగురూ కూడా కాంగ్రెస్ ను వీడనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం శూన్యం అవుతుందన్న చర్చ మొదలైంది. అంతే కాకుండా కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జనతాదళ్ యూ గూటికి చేరితే ఆ పార్టీ బలం బీజేపీని మించుతుంది. 243 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డీయేకు 202 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి 89, జేడీయూకు 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గంపగుత్తగా జనతాదళ్ యూ గూటికి చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు షకీల్ అహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీతోనే ఉన్నారన్న ఆయన పార్టీ కార్యకర్తల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ప్రత్యర్థులు ఇటువంటి ప్రచారానికి తెరతీశారని విమర్శించారు.