స్మగ్లర్ వీరప్పన్ కూతురుకి ఎన్టీకే పార్టీలో కీలక పదవి
posted on Mar 21, 2025 11:40AM
తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. నేరాలను పెంచి పోషించిన వారి వారసులకు అక్కడి రాజకీయ పార్టీలు అక్కున చేర్చుకుని కీలక పదవులు కట్టబెడుతున్నాయి. నేర ప్రవృత్తి అభ్యర్థుల అర్హతగా మారిపోయింది. గంథపు చెక్క స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణికి తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీలో కీలక పదవి వరించింది. ఆ పార్టీ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర కన్వీనర్లలో ఒకరిగా నియమించారు.
పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ విద్యారాణి నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. పిఎంకె పార్టీలో చేరి ఆమె రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 2020లో బిజెపిలో చేరారు. తాజాగా ఎన్టీకేలో చేరి కీలక పదవిని కైవసం చేసుకోవడం చర్చనీయాంశమైంది. గత లోకసభ ఎన్నికల్లో కృష్ణగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్టీకే అభ్యర్థిగా పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు. మూడు రాష్ట్రాలను గడ గడలాడించిన కరడు గట్టిన స్మగ్లర్ వీరప్పన్ 2004లో కర్నాటక అడవుల్లో ఎన్ కౌంటరయ్యారు. వీరప్పన్ కు ఉన్న క్రేజ్ ను ఎన్టీకే వినియోగించుకోవాలని చూస్తోంది. వన్నీయర్ సామాజిక వర్గానికి చెందిన వీరప్పన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడు జనాభాలో 12 నుంచి 15 శాతం వన్నీయార్ లు ఉన్నారు. వీరప్పను లాగే అతని కూతురుని వన్నీయార్లు ఆదరిస్తారని ఎన్టీకే భావిస్తోంది.