ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్
posted on Mar 14, 2012 12:34PM
ప్రస్తుతం రాజకీయ నాయకుల నోట తరచుగా మ్యాచ్ ఫిక్సింగ్ అనేమాట ఒకటి వినబడుతుంది. గతంలో ఈ మాట ఎక్కువగా క్రికెట్ క్రీడలో వినిపించేది. అది ఇప్పుడు రాజకీయాలకు బదిలీ అయింది. ఒక పార్టీ మరో పార్టీని విమర్శించాలనుకున్నప్పుడు ఆ పార్టీ మరేదో ఒక పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుందని, ఆ రెండు పార్టీలు కలిసి తమకు ఓడించడానికి ట్రై చేస్తున్నాయని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై తమను రాజకీయంగా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దొందూ దొందే అని, ఈ రెండు పార్టీలు కలిసి టిడిపిని అధికారంలోకి రాకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణా ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బతికి బట్టకట్టకుండా చేయడానికి టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణాలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాయని టిడిపి నేత ఎర్రంనాయుడు తాజాగా ఆరోపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తే తెరాస ఓట్లు చీలిపోతాయని అది తెలుగుదేశం పార్టీకిలభిస్తుందని అందుకే టిడిపి ఓటమికోసం తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని ఇలా ప్రతి పార్టీ మరో రెండు పార్టీలను మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని ఆరోపిస్తుండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.