పిల్లలు సంస్కారంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఈ విషయాలలో ప్రవర్తన మార్చుకోవాలి..!
posted on Oct 1, 2024 10:21AM
పిల్లల పెంపకం ఓ కళ అని అంటారు. చాలా మంది పిల్లల పెంపకం విషయంలో ఫెయిల్ అవుతుంటారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను జాగ్రత్తగానే పెంచుతుంటాం అని అనుకుంటారు. కానీ పిల్లలు పెరిగి పెద్దయ్యి వారు బాధ్యతగా మారాల్సిన సమయంలో వారి ప్రవర్తనలో ఉన్న తప్పొప్పులు తల్లిదండ్రుల దృష్టిలో పడుతుంటాయి. కాలం గడిచిపోయాక పిల్లలను మార్చాలన్నా మార్చలేరు. పిల్లలు చిన్నతనం నుండే సంస్కారంగా ఉండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తనలో కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాలి. అలా చేస్తే పిల్లలు మంచి విలువలతో పెరుగుతారు. చాలా వరకు పిల్లలు తల్లిదండ్రుల నుండే అన్నీ నేర్చుకుంటారు. వారికి ఇల్లే తొలి బడి అవుతుంది. తల్లిదండ్రులే మొదటి గురువులు, మొదటి రోల్ మోడల్స్ అవుతారు. అందుకే తల్లిదండ్రులు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుంటే..
దయ..
తల్లిదండ్రులు ఆధిపత్య దోరణి వదులుకోవాలి. పిల్లల పట్ల అయినా, బయటి వ్యక్తుల పట్ల అయినా ఆధిపత్య ధోరణిలో ఉండటం మంచిది కాదు. తల్లిదండ్రులు ఆధిపత్య ధోరణిలో ఉంటే పిల్లలు కూడా దాన్నే అలవర్చుకుంటారు. అందుకే ఆధిపత్య ధోరణికి బదులు ఇతరుల ముందు దయతో మాట్లాడాలి. ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి. ఇతరులకు సహాయం చేయాలి. పిల్లలు కూడా ఇవే అలవాటు చేసుకుంటారు.
షేరింగ్..
తమకు ఉన్నదాన్ని ఇతరులకు పంచడం తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాల్సిన ముఖ్య లక్షణం. కుటుంబ సభ్యులతో అయినా, బయటివారితో అయినా షేరింగ్ అనే అలవాటు ఫాలో అవుతుంటే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. లేకపోతే పిల్లలు కుటుంబం, పాఠశాల నుండి పెద్దయ్యే కొద్దీ ఎవరికీ ఏమీ పంచుకోవడం అనేది లేకుండా స్వార్థంగా తయారవుతారు. ఇది వారి జీవితానికి చాలా నష్టం చేకూరుస్తుంది. అందుకే తల్లిదండ్రులు షేరింగ్ ను అలవాటు చేసుకోవడం ద్వారా పిల్లలకు కూడా దాన్ని అలవాటు చెయ్యాలి.
ఎమోషన్స్..
తల్లిదండ్రులు కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య వంటి భావోద్వేగాలను వదిలేయాలి. పిల్లల ముందు వీటిని ఎప్పుడూ బయట పెట్టకూడదు. భావోద్వేగాలను ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు బయటపెట్టకుండా వాటిని నియంత్రించుకుంటూ ఉంటే పిల్లలు కూడా భావోద్వేగాల పట్ల నియంత్రణలో ఉండగలుగుతారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం వల్ల వారి జీవితంలో చాలా విషయాలు సవ్యంగా సాగిపోతాయి.
వినడం..
తల్లిదండ్రులు పిల్లలు అయినా, ఇతరులు అయినా చెప్పేది శ్రద్దగా, ఓపికతో వినాలి. అలా వింటూంటే పిల్లలు కూడా ఏ విషయాన్ని అయినా శ్రద్దగా వినడాన్ని అలవాటు చేసుకుంటారు. లేకపోతే తనకు అవసరమైనది, తాను చెప్పాలనుకున్న విషయం పట్ల మాత్రమే పిల్లలు దృష్టి పెడతారు. ఇది పిల్లలకు మంచిది కాదు.
థాంక్స్..
ఇతరులకు కృతజ్ఞత చెప్పడం చాలా గొప్ప గుణం. చిన్న సహాయం అయినా, పెద్ద సహాయం అయినా ఎదుటివారికి కృతజ్ఞత చెప్పడం వల్ల పిల్లలు కూడా దాన్నే అలవాటు చేసుకుంటారు. ఇది వారిలో గొప్ప విలువలు పెంచుతుంది.
*రూపశ్రీ.