మీ భర్త రొమాంటిక్ గా ఉండటం లేదా? ఇలా చేసి చూడండి..!

భార్యాభర్తల మధ్య  బంధం దృఢంగా ఉండటానికి,  భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని కీలకంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఫిజికల్ రిలేషన్,  ప్రేమను వ్యక్తం చేయడం, చనువుగా ఉండటం,  ఇద్దరూ కలిసి సమయాన్ని గడపడం వంటివి ఎన్నో ఉంటాయి.  చాలామంది భార్యలు తమ మనసులో భర్త పట్ల తమకున్న ప్రేమను,  వారి పట్ల తమ ఇష్టాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తుంటారు. కానీ మగాళ్లు మాత్రం తమ మనసులో విషయాలు బయట పడకుండా కొందరు,  అసలు ఎలాంటి రొమాంటిక్ సెన్స్ లేకుండా ఎప్పుడూ గంభీరంగా ఉండటం,  తమ పనులలో తాము నిమగ్నం అయి ఉండటం వంటివి చేస్తుంటారు.  దీని కారణంగా భార్యలు చాలా డిజప్పాయింట్ అవుతుంటారు.  తమ వైవాహిక జీవితం ఆశించినంత రసభరితంగా లేదని వాపోతుంటారు.  అలాగని తమ భర్తలు చెడ్డ వారు ఏమీ కాదని చెబుతుంటారు.  ఇలాంటి భార్యలు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. వారి భర్తలు భార్యలను ప్రేమలో ముంచెత్తుతారు. తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.

ఓపెన్ గా మాట్లాడాలి..

ప్రతి భార్య చాలా వరకు తను ఏమీ చెప్పకుండా, అడగకుండానే తన భర్త తన ముందు ప్రేమను వ్యక్తం చేయాలని,  తనను సంతోషపెట్టాలని అనుకుంటుంది. కానీ భర్త రొమాంటిక్ గా లేనప్పుడు భార్య ఓపెన్ గా మాట్లాడటం ముఖ్యం.  తను కోరుకుంటున్నది ఏంటి? జీవితంలో ఉండాల్సిన విషయాలేంటి? భార్యాభర్తలు ఎలా ఉండాలని తను అనుకుందో.. ఇద్దరికీ సాధ్యాసాధ్యమైన విషయాలు ఏంటో.. భర్త ఏ విషయాల పట్ల నిరాసక్తిగా ఉంటున్నాడో,   ఎందుకు నిరాసక్తిగా ఉంటున్నాడో.. మొదలైన విషయాలన్నీ ఫిర్యాదు చేస్తున్నట్టు కాకుండా, భర్తను నిందిస్తున్నట్టు కాకుండా..  సౌమ్యంగా తన మనసును అర్థం అయ్యేలా చెప్పాలి. ఇలా చేస్తే భర్త కూడా భార్య మనసును అర్థం చేసుకుని భార్య కోరుకున్నట్టు ఉండటానికి తన వంతు ప్రయత్నం చేయగలడు.

సర్ఫ్రైజ్..

చిన్న చిన్న సర్ప్రైజ్ లు భార్యభర్తల మధ్య బంధాలను దృఢంగా ఉంచుతాయి. భర్త కోసం కూడా అదే విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేయవచ్చు.  లేదంటే భర్తకు నచ్చిన ఆహారాన్ని వండి పెట్టవచ్చు. అతను చాలా రోజుల నుండి కొనాలనుకుని కొనలేకపోయిన  వస్తువును అతనికి ఇవ్వవచ్చు. ఇవన్నీ చేస్తే భార్య భర్త గురించి ఎంత ఆలోచిస్తోందో అనే విషయం భర్తకు అర్థమవుతుంది. అతను కూడా భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి సమయం కేటాయించుకుంటాడు.

ఆప్యాయత..

భార్యాభర్తలు రొమాంటిక్ గా ఉండాలంటే వారి మద్య ప్రేమ కూడా బలంగా ఉండాలి.  ఇద్దరి మధ్య ప్రేమ, అప్యాయత,  ఒకరి పట్ల ఒకరు చూపించే బాధ్యత వంటివి ఇద్దరినీ దగ్గర చేస్తాయి. అప్పుడప్పుడు భార్యభర్తలు ఒకరిపట్ల  ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకోవాలి.  ప్రేమికులలాగా చిలిపి పనులు చేయడం,  సమయాన్ని గడపడం,  ప్రేమను వ్యక్తం చేయడానికి తమకు తూచిన విషయాలను కవితాత్మకంగా వ్యక్తం చేయడం, చూపులు,  సైగలతోనే మాట్లాడటం వంటివి రొమాంటిక్ ఫీలింగ్ ను పెంచుతాయి.

స్పేస్..

ఒక మనిషిని అతిగా పట్టించుకోవడం కూడా అవతలి వారికి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.  భార్యాభర్తలు కూడా అంతే.  వారు ఇద్దరూ ఓ శాశ్వత బంధంలో ఉన్నా సరే.. ఇద్దరికి స్పేస్ అవసరమే.. భర్తకు ఉన్న స్నేహాలు, పరిచయాలలో అతను తనంతకు తాను భార్యకు పరిచయం చేసే వరకు భార్య పట్టించుకోకపోవడమే మంచిది. ప్రతి వ్యక్తి తన ప్రేమను వ్యక్తం చేయడానికి వివిధ మార్గాలు   ఉంటాయి.  వారు ఆ మర్గాన్ని ఎంచుకుని తమ ప్రేమను వ్యక్తం చేసేవరకు ఓపిక పట్టాలి తప్ప రొమాంటిక్ తెలియని వ్యక్తి అని అనకూడదు. ఈ కాలంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే తమ మనసులో విషయాలను వ్యక్తం చేయడానికి చాలా సమయం తీసుకుంటారు.  కాబట్టి అబ్బాయిలకు  సమయం ఇవ్వాలి.  బలవంతంగా అతను ఏదో చెయ్యాలని చేయడానికి బదులు, అతను సహజంగా భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేసేవరకు అతనితో ఫ్రెండ్లీగా ఉంటూ సాగాలి.

అంగీకారం..

భార్యాభర్తలు ఒకరి పట్ల మరొకరు ప్రేమను పెంచుకోవాలన్నా, దాన్ని వ్యక్తం చేయాలన్నా అంగీకార గుణం బాగా సహాయపడుతుంది.  భర్త అలవాట్లు, అతని ఇష్టాలు, అభిరుచులను భార్య గౌరవిస్తూ ఉంటే సహజంగానే భర్తకు తన భార్య పట్ల ఎనలేని ప్రేమ,  గౌరవం పెరుగుతాయి. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించడమే కాకుండా ఒకరికి నచ్చిన పనులు  ఇద్దరూ కలిసి చేస్తుంటే ఒకరి పట్ల మరొకరికి ప్రేమ పెరుగుతుంది.  దాన్ని వ్యక్తం చేసే సందర్బాలు కూడా పెరుగుతాయి.

గ్రహించడం ముఖ్యం..

ప్రేమ అంటే పెద్ద పెద్ద సర్ప్రైజ్ లు ఇవ్వడం,  పెద్ద బహుమతులు ఇవ్వడం, ఖరీదైన వస్తువులు ఇవ్వడం.  పనులు పదులుకుని మరీ సమయాన్ని కేటాయించడం కాదు.. భర్తలు తమకున్న సమయంలోనే భార్యలను సంతోషపెట్టాలని చూసేవారు ఉంటారు.  భార్యకు చిన్న పనులలో సహాయం చేయడం,  భార్య చెప్పే విషయాలను ఓపికగా వినడం, భార్య బాధలో ఉన్నప్పుడు ఆమెకు ఊరట ఇవ్వడం మొదలైనవన్నీ భార్య పట్ల ప్రేమతో చేసేవే. కొందరు సింపుల్ గా తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.  ఈవిషయాన్ని భార్యలు గుర్తిస్తే  భర్తకు తమ పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.  


                                             *రూపశ్రీ. 

Related Segment News