గాంధీజి చేసిన ఈ ఉద్యమాలు చూసి బ్రిటీష్ ప్రభుత్వం భయపడిందట..!

 

 


మహాత్మాగాంధీ పేరు చెప్పగానే చిన్న పిల్లలు కూడా జాతిపిత అని పిలుస్తారు. గాంధీ ఫొటో కానీ గాంధీ గురించి ఉపన్యాసం కానీ లేకుండా ఏ జాతీయ పండుగ ముగియదు. ఇక అక్టోబర్ 2న వచ్చే గాంధీ జయంతిని జరుపుకోవడం తప్పనిసరి.  అయితే మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం చేసిన 40 ఏళ్ల పోరాటంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రధాన ఉద్యమాలకు న్యాయకత్వం వహించారు. ఈ ఉద్యమాలు బ్రిటీష్ పాలకులను, బ్రిటీష్ ప్రభుత్వాలను భయపెట్టడమే కాకుండా భారతదేశంలో పెనుమార్పులకు కారణమయ్యాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమానలు బలోపేతం చేసిన ఈ ఉద్యమాలు ఏంటంటే..

సత్యాగ్రహం..

1906 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో బ్రిటీష్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షా పూరిత విధానాలకు వ్యతిరేకంగా గాంధీజి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు.

చంపారన్ ఉద్యమం..

1917లో బీహార్ లోని చంపారన్ రైతుల దోపిడీకి, నీలిమందు విధానానికి వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమాన్ని చేపట్టారు.

ఖేడా సత్యాగ్రహం..

1918లో బ్రిటీష్ ప్రభుత్వం పన్ను వసూలుకు వ్యతిరేకంగా గుజరాజ్ లో గాంధీజి రైతుల ఉద్యమానికి న్యాయకత్వం వహించారు. దీన్నే ఖేడా సత్యాగ్రహం అంటారు.

స్వదేశీ ఉద్యమం..

గాంధీజి స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టి దేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇది 1920 లో జరిగింది.

సహాయ నిరాకరణ ఉద్యమం..

1920-22 సంవత్సరాలలో మహాత్మా గాంధీ బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.

చౌరీ చౌరా..

1922లో చౌరీచౌరా హింసాత్మక సంఘటన చోటుచేసుకుంది.  దీని కారణంగా గాంధీజి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముగించారు.

ఉప్పు సత్యాగ్రహం..

1930లో బ్రిటీష్ ప్రభుత్వం ఉప్పు పన్ను విధించింది.  దీనికి వ్యతిరేకంగా గాంధీజి దండిలో పాదయాత్ర చేసి ఉప్పు తయారు చేసి చట్టాన్ని ఉల్లంఘించారు.  

శాసనోల్లంఘన ఉద్యమం..

1930 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తిని వ్యక్తం చేయడానికి దాని నిబంధనలను పాటించక పోవడం,  పికెటింగ్ ప్రదర్శన, సమ్మెలు చేయడం వంటివి చేశారు. ఇవన్నీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా జరిగాయి.

దళిత ఉద్యమం..

మహాత్మా గాంధీ దేశంలో కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత ఉద్యమాన్ని 1933లో చేపట్టారు.

క్విట్ ఇండియా..

1942లో బ్రిటీష్ పాలనను అంతం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని గాంధీజి 1942 ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.


                                                 *రూపశ్రీ.