నేతాజీ సుభాస్ చంద్రబోస్.. పరాక్రమ్ దివస్2025..!

 

“నాకు నీ రక్తమివ్వు, నేను నీకు స్వేచ్చనిస్తాను” అనే  నినాదం ఈ దేశ భవిష్యత్తును మరో మలుపుకు తీసుకెళ్లింది.   బానిస సంకెళ్లలో నలిగిపోతున్న ఈ దేశం   అడుక్కోవటం వల్లనో లేక బ్రతిమిలాడడటం వల్లనో స్వేచ్ఛ సంపాదించలేదని, పోరాటం చేసి ఆ  సంకెళ్లని ఈ దేశ ప్రజలే  తెంచుకోవాలన్న సందేశాన్ని భారత పౌరులకి సూటిగా అందజేయగలిగింది ఈ నినాదమే..  స్వాతంత్ర్యం కోసం మనం అమరులమయినా పర్వాలేదు, మన సమాధులే మెట్లుగా స్వతంత్ర సాధనవైపు అడుగులు పడితే చాలు అనుకున్న గొప్ప దేశ భక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయనకున్న అపారమైన దేశభక్తి స్వాతంత్ర్య పోరాటంలో అనేకమందికి స్ఫూర్తిగా నిలిచింది. సివిల్ సర్వీసెస్ కూడా వదిలేసి భారతదేశానికి సేవ చేయాలనే తపనతో స్వాతంత్ర్య పోరాటంలో భాగమైన మహనీయుడాయన. స్వాతంత్య్ర పోరాటంలో తన అపూర్వమైన నాయకత్వం, ధైర్యం, త్యాగంతో లక్షలాదిమందికి స్ఫూర్తిగా నిలిచి, భారతీయుల హృదయాల్లో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్..  ఆయన త్యాగాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన జయంతి దినమైన జనవరి 23ను ‘పరాక్రమ దినోత్సవం’గా గుర్తించి ప్రతీ సంవత్సరం జరుపుకుంటుంది. ఈ రోజు  గురించి, నేతాజీ  పోరాటం గురించి,  ఆయన నాయకత్వం గురించి తెలుసుకుంటే.

నేతాజీ సుభాష్ చంద్రబోస్..


నేతాజీ 1897,జనవరి 23న  ఒడిషాలోని కటక్‌లో జన్మించారు. ఆయనలో చిన్ననాటి నుంచే దేశభక్తి భావనలు గాఢంగా పెరిగాయి.  ఆయన తల్లిదండ్రుల సూచనతో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసి ‌ఎస్) కోసం సిద్ధమయ్యారు. 1920లో సివిల్ సర్వీస్ పరీక్షలో పాసయ్యారు. కానీ 1921 ఏప్రిల్‌లో భారతదేశంలో జరుగుతున్న జాతీయవాద ఉద్యమాల గురించి తెలుసుకుని అక్కడ రాజీనామా చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. గాంధీజీ అనుచరుడిగా, చిత్తరంజన్ దాస్ రాజకీయ శిష్యుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన నేతాజీ తర్వాత యువజన నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. తర్వాత నేతాజీ  విధానాలు నచ్చకపోవటంతో   గాంధీగారి మద్దతు దొరకలేదు.  అయినా సరే భారత స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు సుబాష్ చంద్రబోస్. ఆయన నాయకత్వం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశను అందించింది. “స్వాతంత్ర్యం ఎవరూ ఇవ్వరు,  దాన్ని మనమే సంపాదించుకోవాలి” వంటి నినాదాలు కోట్లాది మందికి స్ఫూర్తి నిచ్చాయి. స్వాతంత్య్రాన్ని  సాధించడానికి ఆయన ప్రదర్శించిన పట్టుదల, అనుసరించిన తెలివైన విధానాలు ఆయనను జాతీయ నాయకుడిగా నిలిపాయి.


 స్వాతంత్ర ఉద్యమానికి చేసిన కృషి..


రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగి, 1938-39లలో  ఐ‌ఎన్‌సి  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నేతాజీ. మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ఈయన విభేధించారు.  ఈ  కారణంగా రాజీనామా చేసి స్వతంత్ర మార్గంలో స్వాతంత్ర్యం సాధించాలన్న తన విధానాన్ని అమలు చేశారు. 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి, వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆక్టివ్గా ఉన్న ప్రతీ వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి,  స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పనిచేశారు. ఆయన 1941లో భారతదేశం నుండి జర్మనీ వెళ్ళి కూడా భారత స్వాతంత్ర్యం కోసం పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్, జర్మనీతో స్నేహం చేయటం ద్వారా, వలస పాలనకు వ్యతిరేకంగా భారత్ పోరాటాన్ని బలపరిచారు.  1943లో ఆయన సింగపూర్‌కు వచ్చి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు నాయకత్వం వహిస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను(ఇండియన్ నేషనల్ ఆర్మీ) పునర్నిర్మించారు. భారతీయ యుద్ధ ఖైదీలు, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులని కలిపి  దాదాపు 45,000 మంది సైనికులతో ఈ ఐ‌ఎన్‌సి ఏర్పాటు చేశారు. ఇది భారత స్వాతంత్య్రానికి సమర్థవంతమైన సాధనంగా మారింది. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశాన్ని బ్రిటీష్ పాలననుంచి విముక్తి చేయడంలో విఫలమైనప్పటికీ,   స్వాతంత్ర్య ఉద్యమానికి  స్పూర్తినివ్వటంలో కీలక పాత్ర పోషించింది. "ఢిల్లీ చలో", "జై హింద్" వంటి ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదాలు  భారతీయుల ఐక్యతను, ధైర్యాన్ని పెంచాయి. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో రాణి ఝాన్సీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడం స్వతంత్ర పోరాటంలో మహిళల పాత్రను ప్రోత్సహించింది. నేతాజీ అనుసరించిన విధానాలు, సైనిక చర్యలవల్ల మున్ముందు భారత సైన్యం తమకి విశ్వాసంగా ఉంటుందన్న నమ్మకం లేదన్న విషయం   బ్రిటిషు వారికి అర్ధమైంది. తద్వారా భారత స్వాతంత్ర్య ప్రక్రియ వేగవంతమైంది.  

ఆయనే త్యాగమే మనకు స్పూర్తి..

 మన దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో జీవితాన్ని త్యాగం చేసిన  గొప్ప నాయకుడు నేతాజీ..  ఆయనను గౌరవించడానికి ఒక అద్భుత అవకాశం ఆయన జన్మదినం. ఆయన 128వ జయంతి సందర్భంగా ఆయన చూపిన  ధైర్యం, పట్టుదల, త్యాగం, ఆయన పోరాటం, ఆయన నాయకత్వం వంటివన్నీ అందరికీ స్పూర్తిగా నిలవాలి. ఆయన చేసిన కృషిని, దేశ నిర్మాణానికి ఇచ్చిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ స్వేచ్ఛ, అభివృద్ది కలిగిన భారతదేశ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రతీ పౌరుడు ఐకమత్యం, ధైర్యం, దేశం పట్ల అంకితభావం అనే ఉన్నత లక్షణాలని అలవర్చుకోవాలి. నేతాజీ హిమాలయాలకు వెళ్ళిపోయాడని,  ఆయన అక్కడే ఉంటాడని చాలా వార్తలు వ్యాపించాయి.  హిమశిఖరాలలో తానూ ఒక శిఖరంగా మారి ఈ దేశానికి ఆయన ఎప్పుడూ కాపు కాస్తుంటాడని భారతీయ దేశభక్తులు,  నేతాజీ త్యాగాన్ని అర్థం చేసుకున్న వారి విశ్వాసం. నేటి కాలం యువత దేశం తల ఎత్తుకునేలా చేయడమే ఆయనకు ఇచ్చే గొప్ప బహుమానం అవుతుంది.

                                         *రూపశ్రీ.