స్థానికఎన్నికలతో కేంద్రనిధులకు లంకె?
posted on Jul 14, 2012 6:10PM
స్థానిక ఎన్నికలు పూర్తయి ప్రజాప్రతినిధులు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు రాష్ట్రానికి కేటాయిస్తారు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. స్థానికంగా ఉండే సమస్యలను చూపిస్తూ రాష్ట్రం కుంటిసాకులు చెబుతోంది. ఆ సమస్యలకు స్థానిక ఎన్నికలకు అసలు సంబంధమే లేదు. అయినా రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అసలు స్థానిక ఎన్నికల కన్నా ఇతర కీలకమైన సమస్యలు ఆయన్ని ఇబ్బంది పెట్టాయి. ఉప ఎన్నికల ఫలితాలు చేదుగా ఉండటంతో ఆయన కూడా స్థానిక ఎన్నికల అవసరాన్ని గుర్తించారు.
అదే స్థానిక ఎన్నికలు పూర్తయి పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు తమ క్యాడర్‌తో ఉండి ఉంటే మరికొన్ని స్థానాలు సాధించేవారమని సిఎం కూడా నమ్మారు. వాస్తవానికి స్థానిక ఎన్నికలను సర్పంచుల పదవీకాలం ముగిసిన ఆరునెలల్లోపే నిర్వహించాలి. అయితే ఉప ఎన్నికల తరువాత స్థానిక ఎన్నికలు జరపొచ్చని మొదట్లో భావించారు. అలానే అసెంబ్లీ ఉప ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలని సిఎం అందరినీ ఆ డైరెక్షనులోకి తిప్పేశారు. అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందుగానే స్థానిక ఎన్నికలు పూర్తయి ఉంటే ఇప్పుడు గ్రామాలు కళకళలాడేవి. కేంద్రప్రభుత్వం విడుదల చేసే పదోఫైనాన్స్ నిధులు గతంలో ఆపేసిన విషయం పాఠకులకు తెలిసిందే. మరోసారి ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ గిరిజనాభివృద్థిశాఖ మంత్రి, అరకు ఎంపి కిశోర్‌చంద్రదేవ్ స్థానిక ఎన్నికలు నిర్వహించకుంటే నిధులు ఆపేస్తామని ప్రకటించారు.