బామ్మ ఆఫ్ ఇండియా మృతి
posted on Mar 24, 2015 2:37PM
భారతదేశంలోనే అందరికంటే ఎక్కువ వయసు వున్న మహిళ కుంజన్నం(112) మంగళవారం నాడు కన్నుమూశారు. కేరళలోని త్రిశూర్ సమీపంలోని పరన్నూర్ గ్రామంలో ఆమె నివసించేవారు. కుంజన్నం ఇండియాలో అతిపెద్ద వయస్సురాలిగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందారు. బాగా వయసు పెరిగిపోవడం వల్ల తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మరణించారు. మే 20న ఆమె 113వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. ఆమె పుట్టినరోజుని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. కుంజన్నం చిన్న వయసులోనే కేవలం 40 రోజుల వ్యవధిలో ఆమె తన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. వారిద్దరూ చాలా చిన్న వయసులోనే మరణించారు. అయితే కుంజన్నం మాత్రం 112 సంవత్సరాలు జీవించింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని మా ఆయుష్షు కూడా పోసుకుని జీవించమంటారు... కుంజన్నం తల్లిదండ్రులు కూడా ఆమెను అలాగే దీవించారేమో... అందుకే వారి ఆయుష్షు కూడా పోసుకుని ఇన్నేళ్ళు జీవించింది.