బిహార్‌కి స్పెషల్ స్టేటస్సా? అంతలేదు..!

బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్ (యు) బిహార్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. జేడీయూ ఎంపీ రామ్ ప్రీత్ మండల్ బిహార్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశమేదైనా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వుందా అని పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. బిహార్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని వెల్లడించారు. 

సాధారణంగా రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతూ వుంటాయి. కేంద్రం ఇప్పుడు అలాంటి ఆలోచన ఏదీ లేదని చెబుతూనే వుంటుంది. అయితే, ఇప్పుడు బిహార్ విషయంలో ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అడగటం అనేది చాలా కీలకమైనది. ప్రత్యేక హోదా ఇవ్వనని కేంద్రం అన్నట్టయితే, బిహార్‌కి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని అడిగే అవకాశం వుంది. ఇప్పుడు బిహార్‌కి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్‌ని కేంద్ర ముందు వుంచే అవకాశం వుంది. అందువల్ల ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్రం ఆచితూచి స్పందించాల్సిన అవసరం వుంది. ఈ అంశంలో ఏమైనా తేడాలు వస్తే ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదం వుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జేడీయూ, తెలుగుదేశం మద్దతుతో మనగలుగుతోంది. ఈ వీక్నెస్‌ని ఆధారంగా చేసుకుని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మోడీ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికి అయితే ఈ వ్యవహారం బిహార్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పడం వరకు అయితే వచ్చింది. ముందుకు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.