మంగళగిరి ఆదర్శ నియోజకవర్గం.. లక్ష్య సాధన దిశగా లోకేష్ అడుగుల వేగం!

ఐదు రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గంలో సాగిన మన ఇల్లు.. మన లోకేష్ కార్యక్రమం ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 3000 మందికి లబ్ధి చేకూరింది. అధికారంలోకి వచ్చిన ఏడాది లోగానే లోకేష్ తన నియోజకవర్గంలో 3000 మందికి వారు నివసిస్తున్న ప్రభుత్వ స్థలంలోనే క్రయ, విక్రయాది హక్కుభుక్తాలతో కూడిన పట్టాలు ఇచ్చారు. లోకేష్ మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా లబ్ధి దారులను ఇచ్చిన పట్టాల విలువ మార్కెట్ రేట్ ప్రకారం వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

ఈ పట్టాలు పొందిన లబ్ధిదారులు వాటిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పట్టాలను లోకేష్ తన స్వహస్తాలతో గ్రామాల వారీగా లబ్ధిదారులకు అందజేశారు.   అదే విధంగా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చివరి రోజు అయిన ఆదివారం (ఏప్రిల్ 13) లోకేష్  మంగళగిరిలో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇది కూడా నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ కావడం గమనార్హం. అలాగే అదే రోజుల రక్షిత మంచినీటి పథకాన్ని కూడా ప్రారంభించారు.  2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ ఆ తరువాత ఐదేళ్లూ అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని, నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఏర్పరుచుకున్నారు. 2024 ఎన్నికలలో 91 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. లోకేష్ కృషి కారణంగా పీపీపీ పద్ధతిలో మంగళగిరి- తెనాలి నాలుగు వరససల రహదారి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. అదే విధంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో  మహానాడు కాలనీలో కృష్ణానది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణం,  జూన్ నుంచి భూగర్భ డ్రైనేజీ, గ్యాస్, విద్యుత్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానన్న లోకేష్ ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టిన పది నెలలలోపే నియోజకవర్గ రూపురేకలు మారిపోయేలా పనులకు, పథకాలకు శ్రీకారం చుట్టారు.