అనుకున్నదొకటి.. అయినది మరొకటి!

అదేమిటో కానీ  తెలంగాణ ప్రభుత్వం  ఏం చేసినా,  ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి  ముఖానికి తాకుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా..ఏ ప్రాజెక్ట్, ఏ పథకం ప్రారంభించినా వివాదాలు, విమర్శలు వెంట వస్తున్నాయి. ఇది ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యానికి, ప్రభుత్వ అసమర్ధ పనితీరుకు అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
మరో వంక  హైడ్రా మొదలు రేవంత్  రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి ప్రాజెక్టూ విమర్శల సుడిగుండంలో చిక్కి అప్రతిష్ట పాలవుతోందనీ, ప్రజల్లోకి వెళ్ళ లేక పోతున్నామనీ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వీటన్నిటికీ మించి  సర్వోన్నత న్యాయస్థానం, సూమోటోగా  విచారణ చేపట్టిన  హెచ్‌సీయూ భూముల వివాదం  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని  అప్రతిష్ట పాలుచేసిందని అంటున్నారు.

ప్రాజెక్టుల పరిస్థితే కాదు, పథకాల పరిస్థితి కూడా   అలానే ఉందని అంటున్నారు. అందుకే, ఇంటా బయట విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని, కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  అవును, అమలు చేయని గ్యారెంటీల విషయంలోనే కాదు.. అమలు చేసిన హామీల విషయంలోనూ విమర్శలు తప్పడం లేదు. అందుకే  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది తలపెట్టినా అనుకున్నదొకటి అయినది మరొకటి అన్నట్లుగానే  కథ అడ్డం తిరుగుతోందని అంటున్నారు. 

ఆఫ్కోర్స్  గత 15-16 మాసాలలో కాంగ్రెస్  ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలలో, అమలుచేసిన వాటికంటే అమలు చేయని గ్యారెంటీలు, హమీలే ఎక్కువ.  చెప్పింది కొండంత చేసింది గోరంత అని జనం పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 15 మాసాలకు పైగానే అయినా  ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ వంటి ఏవో కొన్ని హామీలు మినహా  నిరుద్యోగ భృతి వంటి కీలక హామీల ఊసే లేదు. అలాగే మహిళలకు ఇచ్చిన హమీలదీ అదే కథ.  ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ, ఆడ పిల్లలకు స్కూటీలు,  గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పేరిట ఇచ్చిన లక్ష రూపాయల పెళ్లి కానుకకు అదనంగా  తులం బంగారం ఇస్తామని ఇచ్చిన మహాలక్ష్మి హామీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి  హామీల విషయంలో ప్రభుత్వం నూటికి నూరు శాతం చేతులు ఎత్తేసిందని అంటున్నారు. అలాగే రైతులకు ఇచ్చిన రుణ మాఫీ, రైతు బంధు హామీల అమలు అరకొరగానే వుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

నిజానికి ప్రజల్లో కాదు అధికార  పార్టీ  నాయకులు, కార్యకర్తలల్లోనూ అసంతృప్తి  దాగడం లేదు. బయట పడుతూనే వుంది. ఎవరి దాకానో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతగా సంతృప్తిగా లేరనే విషయం ఆయన మాటల్లో తొంగి చూస్తూనే వుంది. ఒకరిద్దరు మంత్రులు అయితే  రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటే, కేసీఆర్  ప్రభుత్వమే బాగుందని, ప్రజలు అంటున్నారని  తమ మాటను జనం నోటితో వినిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం సంగతి అయితే  చెప్పనే అక్కర లేదు. మింగలేక కక్క లేక అన్నట్లుగా ఉందని అంటున్నారు. 
అయితే  ఈ అసంతృప్తికి  కాంగ్రెస్ నాయకులకు  చేసింది చెప్పుకోవడం చేత కాకాకపోవడమే కారణమని కొందరు కాంగ్రెస్ నాయకులు  పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.  కానీ  అది నిజం కాదు.  నిజానికి  ప్రచారం మోతాదు మించిందనీ, అందుకే ప్రభుత్వం,పార్టీ అప్రతిషతపాలు అవుతోందనే  అభిప్రాయం కూడా  పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందని  అంటున్నారు.    

అదలా ఉంటే, తాజా  సెన్సేషన్  సన్న బియ్యం విషయమే తీసుకుంటే.. ఇతర విషయాలు ఎలా ఉన్నా సన్న బియ్యం చక్కని సూపర్ ఫైన్ సంక్షేమ పథకం. రాజకీయంగా  వెల్  పాలిషిడ్ ఆలోచన. రాజకీయంగా  ప్రయోజనం చేకూర్చే చక్కని పథకం. అయితే, అతి సర్వత్ర వజ్రయేత్  అనే మాట మరిచి  పథకం అమలు కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడం వలన  కథ అడ్డం తిరిగిందని అంటున్నారు. అందుకే  అనుకున్నదొకటి.. అయినదిమరొకటీ అన్నటుగా ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవలసి వస్తోందని అంటున్నారు.  పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు లబ్దిదారుల ఇళ్ళకు వెళ్లి సన్న బియ్యం భోజనం చేయడం వరకు ఓకే.  కానీ, అలికి అన్నం పెట్టడం  ఊరికి ఉపకారం అన్నట్లు సాగుతున్న ప్రచారం ప్రమాదకరంగా మారుతోందని పార్టీ నాయకులే అంటున్నారు.

ఆఫ్కోర్స్  ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే కాదు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అయినా.. మరో ప్రభుత్వం అయినా,  ప్రతి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా రాజకీయ లబ్దిని ఆశిస్తాయి. అలా ఆశించడం తప్పు కూడా కాదు. కానీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో  ఉంచుకుని సన్న బియ్యమే సర్వస్వం అన్న రీతిలో పార్టీ నాయకులకు ఫత్వాలు జారీ చేసి మరీ  ప్రచారం సాగించడం వలన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని, అంటున్నారు.

మరో వంక రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్  రెడ్డి, సన్న బియ్యం క్రెడిట్ మొత్తం తమ సొంత ఖాతాలో వేసుకునేందుకు అసత్యాలు, ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి  కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకంలో భాగంగానే  రాష్ట్రంలో రేవంత్  ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చిందనీ, పేద ప్రజలకు పంపిణీ చేసే ప్రతి కిలో బియ్యాయినికి కేంద్ర ప్రభుత్వం రూ.37 ఇస్తున్నదని, మొత్తంగా చూస్తే సంవత్సరానికి రూ. 10 నుంచి రూ. 12 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందనీ కేంద్ర మంత్రి  బండి సంజయ్  మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంతే కాదు, కేంద్ర నిధులు వద్దను కుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సవాలు విసిరారు. 

మరో వంక  బీజీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి మరీ వాస్తవాలను వివరించి  సన్న బియ్యం ప్రచారానికి కౌంటర్ గా  ‘మోడీ బియ్యం’  ప్రచారాన్ని ప్రారంబించారు. దీంతో ఇప్పడు గ్రామాల్లో సన్న బియ్యం వర్సస్ మోదీ బియ్యం ప్రచారం జోరందుకుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని ఆశించి  ప్రారంభించిన సన్న బియ్యం పథకం కూడా బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.