నెక్స్ట్ ఎవరు.. సీఎస్, డీజీపీయేనా? ఏపీ అధికారుల్లో చర్చ!
posted on Apr 24, 2024 10:54AM
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. కోడ్ లెక్క చేయకుండా అధికార యంత్రాంగం అధికార పార్టీ సేవలో తరించిపోతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందన్న విమర్శలూ వెల్లువెత్తాయి. పశ్చిమబెంగాల్ లో అయితే ఇలా కోడ్ అమలులోకి వచ్చిందో లేదో అలా ఆ రాష్ట్ర పోలీస్ చీఫ్ కు స్థాన భ్రంశమైంది. అక్కడి కంటే అడ్డగోలుగా ఇక్కడ అధికార యంత్రాంగం జగన్ ప్రభుత్వ సేవలో తరిస్తుంటే ఎన్నికల సంఘం ఉదాశీనంగా వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే ఆలస్యంగానైనా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీపై దృష్టి సారించింది. అధికార పార్టీకి అనుకూలంగా అంటకాగుతున్న అధికారులపై వేటు వేస్తోంది. తాజాగా ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతాపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పోస్టింగ్ ఇవ్వాలని విస్పష్టంగా ఆదేశించింది. ఎన్డీఏ కూటమి చాలా రోజుల నుంచి రాష్ట్ర ఇన్చార్జి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి, ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా తాతా సహా.. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ముగ్గురు డీఎస్పీలు, మరికొందరు పోలీసు అధికారులను, ఎన్నికల వరకూ ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఈసీకి ఫిర్యాదు చేసింది.
బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అయితే.. అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా వ్యవహరిస్తున్న అధికారుల జాబితాతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సీఎస్ జవహర్‌రెడ్డి పెన్షన్ల విషయంలో ఈసీ ఆదేశాలు ఉల్లంఘించి జగన్ పార్టీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఇక ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేసింది. అయితే విచిత్రంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉన్న సీఎస్ జవహర్‌రెడ్డి, ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని తొలగించకుండా.. ఇంటలిజన్స్ చీఫ్‌ను తప్పించడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. దేశంలో ఇఫ్పటివరకూ ఇన్ చార్జ్ డీజీపీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగిన సందర్భం లేదు. పశ్చిమ బెంగాల్ లో పూర్తి స్థాయి డీజీపీనే కోడ్ అమలులోకి వచ్చీరాగానే తప్పించిన ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇన్ చార్జ్ డీజీపీని ఇంత వరకూ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు ఇవ్వకపోవడంపై రాజకీయ పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా ఇన్ చార్జి డీజీపీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎన్నికల సంఘం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సీఎస్ గా కాకుండా, అధికార పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ జవహర్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇన్ చార్జ్ డీజీపీ కంటే ముందు ఆయనపై ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉందనీ, ఆ తరువాత కొత్తగా వచ్చే సీఎస్ డీజీపీ విషయంలో నిర్ణయం తీసుకుంటారన్న వాదన అధికారవర్గాల్లో వినవస్తోంది. సీఎస్, ఇన్ చార్జ్ డీజీపీల మార్పు అయితే ఖాయమని అంటున్నారు. ఇహనో, ఇప్పుడో లేదా నేడో రేపో అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని అంచనా వేస్తున్నారు.
అది పక్కన పెడితే తాజాగా ఇద్దరు కీలక ఐపిఎస్ అధికారులపై బదిలీ వేటుతో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఎన్డీఏ నేతల ఫిర్యాదులు ఎదుర్కొంటున్న ఈ స్థాయి అధికారులలో కంగారు మొదలైంది. అధికార పార్టీకి అనుకూలంగా ఎంతగా సేవ చేసినా ఎన్నికల సమయంలో ఈసీ కొరడా ఝుళిపించకుండా తమను అధికార పార్టీ నేతలు కానీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ కాపాడలేరన్న విషయం ఇప్పుడు వారికి అర్థమైనట్లు కనిపిస్తోంది. ఇక నుంచి తటస్థంగా ఉండాలని వారు భావించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఉల్లంఘనులపై ఈసీ విడతల వారీ వేటు వెనుక కూడా ఇదే ఉద్దేశధం ఉండి ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై ఎన్నికల సంఘం వేటు ఏపీ అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తరువాత వంతు ఎవరిదో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.