సోనియాను కలవకుండానే వెనుతిరిగిన సీఎం
posted on Apr 6, 2012 10:18AM
న్
యూఢిల్లీ: విభేదాలను పక్కనపెట్టి సయోధ్యకు సిద్ధపడ్డామన్న రాష్ట్ర ముఖ్యనేతల హామీని వినేందుకు పార్టీ అధినేత్రి సోనియా నిరాకరించారా? ఢిల్లీలో ముఖ్యనేతలకు ఎదురైన పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్ బొత్స, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహౌ గురువారం ఉదయం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో రెండోదఫా చర్చలు జరిపిన అనంతరం 10 జన్‌పథ్‌లో సోనియాని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సయోధ్యగా ఉంటామన్న విషయాన్ని మేడమ్‌తో చెప్పుకునేందుకు అపాయింట్‌మెంట్ కోసం చేసిన ప్రయత్నాలను సోనియా తిప్పికొట్టినట్టు తెలుస్తోంది. విడివిడిగా లేదా గ్రూపుగా కలుస్తామని సూచించినా, సోనియా మాత్రం అంగీకరించలేదని అంటున్నారు. విధాన మండలి సభ్యుడు, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, చిత్తూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన సోనియా, ఇప్పుడు సిఎం, డిప్యూటీ సిఎం, పిసిసి నేతకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవకుండానే న్యూఢిల్లీ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోసం ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్ సాధారణ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సమీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో యుపి ఫలితాల సమీక్షలు ఉన్నందున అపాయింట్‌మెంట్ ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రికి నేతల ద్వారా సోనియా గాంధీ తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి అధినేత్రిని కలవకుండానే ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. బొత్స, కిరణ్‌ల మధ్య ఉన్న విభేదాలపై సోనియా గాంధీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఆమె వారితో భేటీ అయ్యేందుకు నిరాకరించి ఉండవచ్చునని అంటున్నారు. అయితే ఆమె మాత్రం బొత్స, కిరణ్‌లకు ఏం చెప్పాలనుకున్నారో ఆ విషయాన్ని కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ద్వారా చెప్పించారని అంటున్నారు. విభేదాలపై వారికి అధిష్టానం హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు.