పాయకరావు పేటలో జోరుమీదున్న దేశం
posted on Apr 6, 2012 10:22AM
పాయకరావు పేట అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ ఎమ్మెల్యే చంగల వెంకట్రావు గ్రామ గ్రామానికి తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చెంగల వెంకటరావుకు ఈ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. గత ఎన్నికల్లో ఆయన అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయంపాలయ్యారు. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం మొదటినుంచి తెలుగుదేశంపార్టీకి కంచుకోటలా ఉంది. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఎక్కువసార్లు గెలిచారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గంటెల సుమన విజయం సాధించగా 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
వైయస్ మరణానంతరం గొల్ల బాబూరావు జగన్ పార్టీకి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురికావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో గొల్ల బాబూరావు, చెంగల వెంకటరావు మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఒకవైపు ఈ ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉండగా కాంగ్రెస్ విభేధాలతో సతమతమవుతుంది. పార్టీలో విభేదాల కారణంగా ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన, 2004లో పోటీచేసిన అంబటి విజయరావు, మాజీ ఎమ్మెల్యే తాకర సూకరాజు, కోతవరపు మాజీ జడ్ పి టి సి సభ్యుడు కొండలరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కెకెఆర్ సుందరిలత తదితరులు పోటీపడుతున్నారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకులు ఇప్పటికే గ్రామాల్లో సమావేశారు నిర్వహిస్తున్నారు. డిసిసి అధ్యక్షుడు తోట నగేష్, ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గడ్డం బుజ్జి తదితరులు ఆ మండలాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 8 లేదా 9 తేదీల్లోగా కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం వుంది.