వైయస్సార్ కాంగ్రెస్ ... హరి ...!

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీకి ఒక ప్రత్యేకత వుంది. అందరూ అనుకొంటున్నట్టుగానే అటువంటి ప్రత్యేక తేదీన హరిరామ జోగయ్య వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ... సహజంగా ఒక పార్టీ వేరొకపార్టీలో చేరే సమయంలో బాణాసంచా, బ్యాండ్ మేళాల మధ్య హడావుడిగా చేరతారు. కాని హరిరామ జోగయ్య మాత్రం జగన్ ముద్దులు, సెక్యూరిటీ సిబ్బంది పిడిగుద్దుల మధ్య వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో పార్టీలు మార్చిన ఘనత ఈయనకే దక్కుతుంది.

వీరికి వున్న మరో ప్రత్యేకత వారు ఏ పార్టీలో కాలుపెడితే ఆ పార్టీ హరీ ... అంటుందనే పేరు. వై ఎస్ ఆర్ పార్టీ ఏమవుతుందో చూడాలి. తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించిన సమయంలో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వుండి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంపార్టీలో చేరారు. కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంపార్టీలో చేరారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు హయాంలో మరల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వై ఎస్ ముఖ్యమంత్రిగా వుండగా వై ఎస్ ను విమర్శించడంతో పాటు కాంగ్రెస్ పార్టీని వదిలి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పటికీ ఆయన మాత్రం విలీనం కాలేదు. నిజానికి ప్రజారాజ్యం విలీనం అయ్యే సమయానికి ఆయన చిరంజీవితో విభేధాలు వచ్చి పార్టీకి దూరంగా వుండటమే అందుకు కారణం. ఈ సమయంలో ప్రత్యేక ఆంద్ర అనే నినాదంతో అడపాదడపా వార్తలలో వ్యక్తిగా వున్నప్పటికీ క్రియాశీలక రాజకీయాలకి దూరంగా వున్నారు. తాజాగా జోగయ్య వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుని సమక్షంలో చేరారు. అయితే ఇంతాచేసి ... తనకు పదవులపై ఆశలేదని ... జగన్ పై అభిమానంతో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ప్రకటించడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించినా తర్వాత "ఏప్రిల్ 1'' తేదీని గుర్తు తెచ్చుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu