జాతీయగీతం వస్తుంటే నిలబడలేదని చెన్నైలో..
posted on Dec 12, 2016 3:51PM
ధియేటర్‌లో జాతీయగీతం ప్రదర్శితమవుతుండగా నిలబడలేదని ఏడుగురు విద్యార్థులపై కొందరు దాడికి పాల్పడ్డారు. నిన్న చెన్నైలోని ఓ ధియేటర్‌లో ఉదయం 11.30 గంటల షోకు కొందరు విద్యార్థులు హాజరయ్యారు. అయితే ధియేటర్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించాలన్న సుప్రీం ఆదేశాలతో సదరు ధియేటర్‌లో జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే జాతీయ గీతం వస్తున్న సమయంలో సీట్లలో కూర్చున్న విద్యార్థులు లేచి నిలబడలేదు..దీంతో కొందరు వ్యక్తులు ఆ విద్యార్థుల వద్దకు వెళ్లి జాతీయగీతం వచ్చినప్పుడు ఎందుకు నిలబడలేదంటూ వాగ్వాదానికి దిగారు.
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సుమారు 20 మంది.. విద్యార్థులను చితకబాదారు. సినిమా మధ్యలోనే వెళ్లిపోయిన విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. జాతీయగీతం వచ్చినపుడు మేము ఎవ్వరం కూడా లేచి నిలబడలేదు..అంత మాత్రం చేత మాకు దేశభక్తి లేదనుకోవడం పొరపాటు. మా వెనుక కూర్చున్న యువకులు సినిమా జరుగుతున్నంతసేపూ అసభ్య పదజాలంతో దూషించారు..చివరకు దాడికి దిగారని తెలిపారు. అయితే జాతీయగీతం వస్తుండగా నిలబడకపోవడం చట్టరీత్యా నేరం కావడంతో పోలీసులు సదరు విద్యార్థులపైనా కేసు నమోదు చేశారు.