జయ కూతురిపై క్లారిటీ

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వ్యక్తిగత వివరాలతో రోజూ వార్తాపత్రికలు నిండిపోతున్నాయి. జయ వారసుల గురించో..ఆస్తుల గురించో ఏదో ఒక రూపంలో కథనాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జయలలిత కుమార్తె అంటూ గత కొన్నిరోజులుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ  చక్కర్లు కొడుతోంది. ఫోటోలోని మహిళ అచ్చుగుద్దినట్టు జయను పోలీ ఉండటంతో అమ్మ వారసురాలు ఈమేనంటూ జనం కూడా నమ్మేశారు.

 

అక్కడితో ఆగితే ఓకే కానీ పుకారు రాయుళ్లు ఊరుకుంటారా..? ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఆమె త్వరలోనే తమిళనాడు వస్తారని, ముఖ్యమంత్రి పదవి చేపడతారని కూడా కథలల్లారు. ఇది ఇప్పుడు తాజాగా జరిగిన విషయం కాదు..అయితే జయ మరణం తర్వాత ఈ ఫోటోకి ప్రాధాన్యత వచ్చింది. అమ్మ అభిమానులు, తమిళనాడు ప్రజలు ఈ విషయంపై జుట్టుపీక్కుంటుండగా ఈ ఉత్కంఠకు తెర దించారు గాయని చిన్మయి శ్రీపాద.

 

ఆ మహిళ, ముఖ్యమంత్రి గారి కూతురు కాదు..ఆమె తన కుటుంబానికి తెలిసిన వ్యక్తని..ఆమె పేరు దివ్యా రామనాథన్ వీరరాఘవన్ అని పేర్కొన్నారు. దివ్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన భర్తతో కలిసి నివసిస్తున్నారని తెలిపారు. ఆమె మృదంగ విద్వాంసులు వి.బాలాజీ కుటుంబానికి చెందిన వారు. ఆయన కచేరీలతో బిజీగా లేనపుడు "హస్‌బాన్డ్" అనే వెబ్ ‌సిరీస్‌లో పనిచేస్తారు అని ఫేస్‌బుక్‌‌లో పోస్ట్ చేసింది.