ఎమ్మెల్యేగారు... జాతీయ గీతం టైంలో ఫోన్ మాట్లాడుకున్నారు!
posted on Dec 19, 2016 1:44PM
.jpg)
ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ గీతం చర్చే! సుప్రీమ్ కోర్టు మొదలు పవన్ కళ్యాణ్ వరకూ అంతటా, అందరూ జనగణమన గురించే స్పందించేస్తున్నారు! సినిమా హళ్లలో జాతీయ గీతం వస్తే నిలబడాలా అని కొందరు, నిలబడకపోతే దేశ భక్తి లేనట్లా అని మరి కొందరూ ప్రశ్నిస్తున్నారు. కేరళలో అయితే ఫిల్మ్ ఫెస్టివల్ సందర్బంగా జనగణమన వస్తోంటే కూర్చుని వుండిపోయిన 12మందిని అరెస్ట్ కూడా చేశారు. తమిళనాడులో జాతీయ గీతం సమయంలో నిలబడని వార్ని కొట్టారు కూడా. ఇలాంటి రచ్చ జరుగుతోన్న సమయంలోనే ఒక ఎమ్మేల్యే వారు జాతీయ గీతానికి అవమానం చేశారు!
ప్రజాప్రతినిధులుగా వుండటమంటే ఉపన్యాసాలు దంచటం, అవినీతి సొమ్ము సంపాదించుకోవటం, బుగ్గ కార్లో తిరగటం అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం. సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయకున్నా కనీసం జాతీయ గీతాన్నిగౌరవించటం కూడా మన వాళ్లు చేయలేకపోతున్నారు. బెంగాల్ ని ఏలుతోన్న టీఎంసీ పార్టీలోని ఒక ఎమ్మెల్యే వైశాలీ దాల్మియా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆమె ఈ మధ్యే ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొంది. ఆ సమయంలో అక్కడ జాతీయ గీతం వినిపించారు. అందరూ అటెన్షన్ గా నిల్చుని వుండగా ఈమెగారు మాత్రం ఫోన్ లో మాట్లాడుకున్నారు. కెమెరాలన్నీ ఆమెనే చూస్తూండటంతో కాల్ కట్ చేసి అలెర్ట్ అయ్యారు! అసలు జనగణమన వస్తున్న 52సెకన్లలోనే ఆమె మాట్లాడాల్సి వచ్చిన అంతటి అర్జెంట్ కాల్ ఏంటి? అయినా అలా చేస్తే దేశానికే అవమానం, కేసు పెట్టే అవకాశం వుందని ఆమెకు తెలియదా? తెలిసినా అధికార పక్షం ఎమ్మెల్యేననే అహంకారమా?
టీఎంసీ లోని ఒక్క ఎమ్మెల్యేనే కాదు మన దేశంలో అన్ని పార్టీల్లోని చాలా మంది నేతలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంటారు. తమ పార్టీ అధినేతలకి సాష్టంగా నమస్కారాలు చేసే ఈ బానిసలు దేశానికి, దేశ జెండాకు, జాతీయ గీతానికి ఔన్సు గౌరవం కూడా ఇవ్వరు. ఇలాంటి వారి సారథ్యంలో భారతదేశం వుండటం వల్లే మన పరిస్థితి 70ఏళ్లుగా ఇలా వుంటోంది! సినిమా థియేటర్లలో దేశ భక్తి నిరూపించుకోవాలా అని ప్రశ్నించే వారు ఈ బెంగాల్ ఎమ్మెల్యేని చూసి విషయం అర్థం చేసుకోవాలి! కనీసం 52 సెకన్లు కూడా దేశం కోసం వెచ్చించలేని పరమ దుర్మార్గమైన భారతీయులు మన దేశంలో వున్నారు! అదే పెద్ద విషాదం...