చంద్రబాబు మీద హరికృష్ణ విసుర్లు... అందుకేనా
posted on May 28, 2016 11:52AM
కొంతకాలంగా తెదెపా నాయకత్వం మీద గుర్రుగా ఉన్న ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ తన గళాన్ని విప్పారు. అది కూడా అందరూ వినే సందర్భంలో! తెదెపాలో క్రమక్రమంగా బాలకృష్ణకు ప్రాధాన్యత పెరగడంతో... అదే స్థాయిలో హరికృష్ణ ప్రాభవం తగ్గిపోతోంది. పైగా లోకేశ్‌ను నిదానంగా ముందు వరుసలోకి తీసుకువచ్చేందుకు, జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెడుతున్నారన్న వాదనా వినిపిస్తోంది. ఇటు తనకీ, అటు తన తనయుడికీ తెదెపాలో గుర్తింపు తగ్గిపోవడం సహజంగానే హరికృష్ణకు మింగుడుపడటం లేదు. ఒకప్పుడు తండ్రి వెంట నీడలా ఉండి, పార్టీకి పునాదులని ఏర్పరిచిన తననే చంద్రబాబు లెక్కచేయకపోవడం హరికృష్ణకు బాధ కలిగించే అంశమే! అందుకే పార్టీ సమావేశాలకు, ఆఖరికి ప్రస్తుతం జరుగుతున్న మహానాడుకి కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఇక హరికృష్ణ తన అక్కసుని వెళ్లగక్కేందుకు ఈసారి ఎన్టీఆర్ జయంతి కూడా కలిసివచ్చింది. ఇవాళ ఉదయమే తారకరత్న, కళ్యాణ్‌రామ్‌లతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న హరికృష్ణ అదను చూసి చంద్రబాబుకు చురకలంటించారు.
ప్రత్యేక హోదా గురించి ఆంధ్రుల రక్తం ఉడుకుతున్న తరుణంలో ఆ సెంటిమెంటుకి అనుగుణంగానే వాగ్బాణాలను సంధించారు. ఆనాడు ప్రత్యేక హోదా ఇస్తామన్నవారు మోసం చేశారనీ, మరి తెస్తామన్నవారు ఏం చేస్తున్నారో తెలియడం లేదంటూ... అటు బీజేపీ, ఇటు తెదెపాలను దెప్పిపొడిచారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందనీ.... అలా పోరాడిన రోజునే అన్నగారికి ఘననివాళి అర్పించినట్లనీ చెప్పుకొచ్చారు. మహానాడుకు ఎందుకు గైర్హాజరయ్యారన్న ప్రశ్నకి బదులుగా అన్నగారికి నివాళులు అర్పించడం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని ఎదురు ప్రశ్న వేశారు. మరి హరికృష్ణ విమర్శలకు తెదెపా శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి!