నాగం తెలంగాణా నగారా
posted on Sep 9, 2011 10:50AM
మహ
బూబ్ నగర్: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నాగర్ కర్నూల్ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి కొత్త వేదిక తెలంగాణ నగారా సమితిగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల కొండల్లోని ఉమామహేశ్వర ఆలయంలో తెలంగాణ నగారా సమితి పేరుతో పూజలు చేశారు. దేవుడికి అభిషేకం నిర్వహించారు. ఈ పూజల్లో నాగంతో పాటు టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాల చారి పాల్గొన్నారు. నాగంకు మద్ధతుగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, తెలంగాణవాదులు దేవాలయానికి వచ్చి పూజలో పాల్గొన్నారు. కాగా గత కొంతకాలంగా తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరిపై నాగం జనార్ధన్ రెడ్డి అండ్ కో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సమయంలో తాను కొత్త పార్టీ లేదా కొత్త వేదిక ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అయితే తెలంగాణ నగారా సమితి పేరుతో పూజలు జరిపించడంతో ఆయన అదే పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.