ఆయన నోరుతెరిస్తే చాలా మందికి కష్టాలు జయ
posted on Sep 9, 2011 11:25AM
న్యూఢిల్లీ
: నోటుకు ఓటు కేసులో అరెస్టయిన అమర్ సింగ్ నోరు తెరిస్తే చాలా మందికి కష్టాలు తప్పవని సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద అన్నారు. అమర్ సింగ్ ద్వారా లబ్ధి పొందినవారు సంక్షోభ సమయంలో వెనక్కి తగ్గారని ఆమె గురువారం ఓ ఆంగ్ల దినపత్రికతో అన్నారు. మూత్రపిండాలకు ఇన్‌పెక్షన్ సోకుతుందనే భయంతో అమర్ సింగ్ జైలులో ఏమీ తినడం లేదని, వాంతులు చేసుకుంటున్నారని ఆమె చెప్పారు. జైలులో ఉండడం అమర్ సింగ్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆమె అన్నారు. విశ్వాస పరీక్ష సందర్భంగా జరిగిన ఓటుకు నోటు స్కామ్ ద్వారా ప్రయోజనం పొందినవారు వేరే ఉన్నారని, అమర్ సింగ్‌కు ఏ విధమైన ప్రయోజనం చేకూరలేదని, అటువంటప్పుడు అమర్ సింగ్ ఎందుకు జైలులో ఉండాలని ఆమె అన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం దాడి చేస్తున్నా అమర్ సింగ్ మౌనంగా ఉన్నారని, అమర్ సింగ్ నోరు తెరిస్తే చాలా మంది ఇబ్బందుల్లో పడుతారని, మాటకు కట్టుబడడం వల్లనే మాట్లాడడం లేదని, అది అమర్ సింగ్ వ్యక్తిత్వమని ఆమె అన్నారు. అమితాబ్ బచ్చన్ కూడా అమర్ సింగ్ పక్కన నిలబడకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు.