బీజేపీ, వైసీపీ లవ్ స్టొరీ కంటిన్యూస్...?

మనసు ఒక చోట..మనువు ఒకచోట అన్నట్లుగా ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ వైఖరి ఉంది. గత ఐదేళ్లుగా వైసీపీ, బీజేపీల రహస్య మైత్రి ఎంత దృఢంగా కొనసాగిందో తెలిసిందే. అయితే   కేంద్రంలో అధికారాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి దక్షిణాది నుంచి కూడా మద్దతు అనివార్యం అన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పార్టీ పాతమిత్రులకు ఆహ్వానం పలికింది. ముఖ్యంగా ఏపీలో ప్రజాభిమానం మెండుగా ఉన్న తెలుగుదేశం అవసరం బీజేపీకి తప్పని సరి అయ్యింది. పాతిక లోక్ సభ స్దానాలున్న ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఒక్క స్థానంలో కూడా గెలిచే   అవకాశాలు లేని బీజేపీకి.. అక్కడ అధికార వైసీపీతో బంధం కంటే.. తెలుగుదేశంతో పొత్తు వల్లనే ఎక్కువ ప్రయోజనం, రాజకీయ లబ్ధి దొరుకుతుందని అర్ధమైంది. అందుకే  ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమితో జట్టు కట్టింది. పొత్తులో భాగంగా రాష్ట్రంలో తన వాస్తవ బలం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా  సీట్లనూ సంపాదించుకుంది. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక బీజేపీ తమ జట్టులో ఉంటే జగన్ సర్కార్ ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్టపడుతుందనీ, కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందనీ తెలుగుదేశం, జనసేనలు భావించి.. కొన్ని త్యాగాలు సైతం చేశాయి. అయితే.. తెలుగుదేశం, జనసేనతో పొత్తు ముడి పడినా, మనసు మాత్రం వైసీపీతోనే ఉందని వరుసగా జరుగుతున్న పరిణామాలు పదేపదే రుజువు చేస్తున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడగింపు విషయంలోనైతేనేమి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై కూటమి నేతలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం,  ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు జగన్, మోడీల రహస్య బంధం ఎంత పటిష్టంగా ఉందో అవగతం చేస్తున్నది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఇన్ చార్జ్ ల స్థానంలో పూర్తి స్థాయి అధికారులను నియమించడం విధాయకం. అలాగే డెప్యూటేషన్ మీద ఉన్న అధికారులను కూడా మార్చేస్తారు. ఏమిటో మరి ఏపీ స్పెషల్. ఇక్కడ అలా జరగడం లేదు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై కూటమి నేతలు ఫిర్యాదులు చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన ఫిర్యాదును కూడా ఎన్నికల సంఘం బుట్టదాఖలు చేసినట్లు కనిపిస్తోంది. ధర్మారెడ్డి డెప్యుటేషన్ గడువు ముగుస్తున్న తరుణంలో ఆయనను టీటీడీ ఈవోగా మార్చడం ఖాయమనే అంతా భావించారు. రిటైర్మెంట్ ముందు సొంత శాఖకు పంపించేయడం ఆనవాయితీ. అయితే ధర్మారెడ్డి విషయంలో మాత్రం ఆ ఆనవాయితీని పాటించకుండా ఆయనకు పొడగింపు ఇవ్వడం జగన్, మోడీ బంధం కొనసాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సరే ఆనవాయితీలు అవీ పక్కన పెట్టినా..  ధర్మారెడ్డిని బదిలీ చేయాలని, ఆయన  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉంటే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందే శ్వరి ఈసీతోపాటు కేంద్రానికీ లేఖ రాశారు. అలాగే  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి సైతం  ధర్మారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన పలుకుబడి-అధికారాన్ని వైసీపీ విజయం కోసం వినియోగిస్తున్న ధర్మారెడ్డిని   బదిలీ చేయాలని ఈసీని కోరారు. అటు కూటమిలోని తెలుగుదేశం, జనసేనలు కూడా ధర్మారెడ్డిని తప్పించాలని కోరాయి.  కోరింది కూటమి కాబట్టి.. ఇంకేముంది ధర్మారెడ్డి బదిలీ ఖాయమనే అంతా భావించారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం  ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలన్న జగన్ అభ్యర్ధనను ఓకే చేసింది. ఇదే జగన్ మోడీల మధ్య ఉన్న లవ్ స్టోరీ కంటిన్యూ అవుతోందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

 ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడగింపు కూటమి భాగస్వామ్య పక్షాలకు ఇస్తున్న సంకేతాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ ఏపీలో జగన్ మాటే కేంద్రంలో చెల్లుతుందన్న సంకేతాలు వెళితే ప్రజలకు కూటమి పట్ల విశ్వాసం ఎలా కలుగుతుంది? అసలు కూటమిలో బీజేపీకి తెలుగుదేశం, జనసేన ఓట్లు బదిలీ అవుతాయా?  అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం తెలుగుదేశం, జనసేన బలాన్ని వాడుకుని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు సాధించాలన్న వ్యూహంతోనే బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఎన్నికల సమయంలో జగన్‌కు అనుకూలంగా ఉండే అధికారుల మార్పు, విపక్ష నేతలకు పోలీసు వేధింపులూ లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయన్న  భావనతోనే బీజేపీని కలుపుకున్నాం అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదని తెలుగుదేశం, జనసేనలు   అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.  ఎన్నికల సంఘం  జనసేన సింబల్ గ్లాసు గుర్తును ఇతరులకూ కేటాయిస్తోంది. డీజీపీ, సీఎస్‌ను ఇంతవరకూ మార్చలేదు. ధర్మారెడ్డిని మార్చమంటే, ఆయన డెప్యుటేషన్ పొడిగించారు.  బీజేపీతో జగన్ సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఆయనను మోడీ ఇప్పటికీ దత్తపుత్రుడిగానే చూస్తున్నారని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనాలేం కావాలని తెలుగుదేశం, జనసేన శ్రేణులు అంటున్నాయి.  

ఈ పరిస్థితిలో తెలుగుదేశం, జనసేన ఓట్లు బీజేపికీ బదిలీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏపీలో ఎన్నికల నిబంధనలు సరిగా అమలయ్యేలా దృష్టి సారించాలనీ, అలా కాకుండా ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అంటూ నంగనాచి కబుర్లు చెబితే ఫలితం ఉండదనీ అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో రెండు దశల పోలింగ్ పూర్తయిన తరువాత ఉత్తరాదిలో బీజేపీ భారీగా నష్టపోతోందన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ విషయంలో జగన్ పార్టీకి వత్తాసుగా వ్యవహరిస్తే ఇక్కడ కూడా బీజేపీ తీవ్రంగా నష్టపోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం అధికారుల అండ, పోలీసుల దండతో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనీ, జనం డిసైడైపోతే డబ్బు అధికారం ఏవీ కాపాడలేవన్న సంగతి.. బీహార్, కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాతైనా బీజేపీ అర్థం చేసుకోకపోతే తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.