కేసీఆర్ బస్సు యాత్ర ఆపేస్తారా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టారు. మే 10వ తేదీ వరకు ఆయన బస్సు యాత్రలో వివిధ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం చేయాలని సంకల్సించారు. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారంలో వున్న ఆయన మే 10వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం చేస్తారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సు సర్వ సదుపాయాలు వున్న ఏసీ బస్సు, బస్సులో కేసీఆర్‌కి అవసరమైన అన్ని ఏర్పాట్లు వున్నప్పటికీ బస్సు యాత్రను ఎక్కువ రోజులు కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్‌లో క్షీణిస్తున్న ఓపిక అని తెలుస్తోంది.

బస్సు యాత్ర ప్రారంభించిన రెండు మూడు రోజుల్లో కేసీఆర్ మాట్లాడిన తీరుకు, ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకు ఎంతో తేడా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. భయంకరమైన ఎండల  ఎఫెక్ట్.తోపాటు అధికారం కోల్పోయిన ఎఫెక్ట్, కూతురు జైల్లో వున్న ఎఫెక్ట్, వయసు పైబడిన ఎఫెక్ట్ కేసీఆర్ మీద ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. దాంతో ఆయన చాలా వరకు నెమ్మదించారని చెబుతున్నారు. చెప్పిన విషయాలే చెప్పడం, తిట్టిన తిట్లే తిట్టడం లాంటి చేసినపనే చేయడం కూడా ఆయనకు నిరాసక్తత కలగడానికి కారణం అయి వుండవచ్చని అంటున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఊహించని విధంగా అధికారం కోల్పోవడం, కవిత జైలుకు వెళ్ళడం కేసీఆర్‌ని బాగా కుంగదీశాయని అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కి ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పక్క రాష్ట్రం తాలూకు ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సమాచారం అందుకునే నెట్ వర్క్ వున్న కేసీఆర్‌కి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటో కూడా తెలిసే వుంటుంది. కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చే అవకాశం వుందని వినిపిస్తున్న వార్తలు కూడా కేసీఆర్‌ని మరింత కుంగదీసి వుండవచ్చు. వయసు, వాతావరణ పరిస్థితులు, ఒత్తిడి, ప్రోత్సాహకరంగా లేని రాజకీయ పరిస్థితులు... ఇవన్నీ కేసీఆర్‌ బస్సు యాత్రని మధ్యలోనే ముగించేలా చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.