నారాయణ పెత్తనం... గల్లా, శ్రవణ్ కి చేదు అనుభవం
posted on Oct 23, 2015 1:12PM

రాజధాని భూసమీకరణ నుంచి అమరావతి శంకుస్థాపన ఏర్పాట్ల వరకూ అన్నిటిలో తలదూర్చి అంతా తానై వ్యవహరించిన మంత్రి నారాయణ... మిగతా మంత్రులకు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు చుక్కలు చూపించినట్లు తెలిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పెత్తనం చెలాయించిన నారాయణ... మిగతా నేతలకు కనీసం గుర్తింపు లేకుండా చేశారని వాపోతున్నారు, నారాయణ ఓవరాక్షన్ ని తట్టుకోలేక కొందరు సైడైపోగా, మరికొందరు మాత్రం ఆయన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
అయితే మంత్రి నారాయణ బాధితుల్లో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కూడా ఉన్నారని చెప్పుకుంటున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నియోజకవర్గాల పరిధిలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగగా, కనీసం వీరిద్దరికీ సరైన ప్రాధాన్యతే దక్కలేదు, ప్రోటోకాల్ ప్రకారం చూసినా, సంప్రదాయం మేరకైనా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకి వేదికపై చోటు ఇవ్వాల్సి ఉండగా... వీళ్లిద్దరినీ పట్టించుకున్నవాళ్లే లేరు, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆటలో అరటిపండులా మారగా, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. ఆనవాయితీ ప్రకారం కనీసం శంకుస్థాపన చేస్తున్న సమయంలోనైనా స్థానిక ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కి అవకాశం కల్పించాల్సి ఉందని, కానీ మంత్రి నారాయణ పెత్తనంతో వీళ్లిద్దరూ సైడైపోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై స్థానిక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పేర్లు లేకపోవడం విమర్శలు చెలరేగుతున్నాయి, దీనిపై గల్లా జయదేవ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేశారు, స్థానిక ప్రజాప్రతినిధులను ఇలా అవమానించడం సరికాదని వ్యాఖ్యానించారు
అయితే నారాయణ వ్యవహార శైలిపై పలువురు టీడీపీ నేతలు మండిపడుతున్నారు, ప్రతి దాంట్లోనూ నారాయణ తలదూర్చుతూ... సీనియర్లను సైతం అవమానించేలా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించి నారాయణ ఆగడాలకు అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు.