దిగొచ్చి అనిల్ ఇంటికొచ్చిన కాకాణి.. మాజీ మంత్రిదే అప్ప‌ర్ హ్యాండ్‌?

మొన్నటి దాకా వారు బద్ధ శత్రువులు. నేడు ఒక్కటయ్యారు. ఒకరు తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. మరొకరు తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్ వద్ద పంచాయితీ జరిగిన తర్వాత ఏమైందో ఏమో.. అనిల్ కుమార్ ఇంటికి మంగళవారం మంత్రి కాకాణి స్వయంగా వెళ్లారు. అనిల్ ను శాలువాతో సన్మానించారు. తన ఇంటికి వచ్చిన కాకాణిని అనిల్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. దీంతో వారి మధ్య పొడసూపిన విభేదాలు పటాపంచలయ్యాయా? జగన్ వారికి ఇచ్చిన ఆదేశాలు ఫలించాయా? అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.

నిజానికి మంగళవారం ఉదయం కూడా మీడియా సమావేశంలో అనిల్ పరోక్షంగా ఫ్లెక్సీల గురించే వ్యాఖ్యలు చేశారు. అయితే.. సాయంత్రానికి తమలో విభేదాలు లేవంటూ యూ టర్న్ తీసుకున్నారు. కాకాణి- అనిల్ మధ్య విభేదాలు ఫ్లెక్సీలు చింపే వరకు వెళ్లాయి. ప్రమాణస్వీకారానికి తనకు ఆహ్వానం పంపలేదని ఒకరంటే.. పంపానని మరొకరు మీడియా ముందు చెప్పారు. చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దర్నీ తాడేపల్లి పిలిపించి తన శైలిలో మాట్లాడాల్సి వచ్చింది. ఇదంతా గతం.

మంగళవారం సాయంత్రం అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో ఉన్నారని సమాచారం అందగానే కాకాణి గోవర్ధన్ రెడ్డి భేషజాలకు పోకుండా నేరుగా అనిల్ నివాసానికి వెళ్లారు. మంత్రి కాకాణి రాగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘనస్వాగతం పలికారు. ఇరువురు ఆప్యాయంగా పలకరించుకుని సుమారు పదిహేను నిమిషాలసేపు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. వారి మధ్య విభేదాలు గాలిబుడగల్లా తేలిపోయాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వారు అనడం కొసమెరుపు.