దళితుడిపై కోన వెంకట్ దాడి
posted on May 12, 2024 9:10AM
సినీ రచయిత, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి బంధువు, సినీ రచయిత అయిన కోన వెంకట్ కత్తి రాజేష్ అనే యువకుడి మీద తన అనుచరులతో కలసి దాడి చేశారు. ఆ దాడి కూడా సాక్షాత్తూ పోలీస్ స్టేషన్లోనే కావడం గమనార్హం. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెంలో ఈ ఘటన జరిగింది. గతంలో వైసీపీలో వున్న కత్తి రాజేష్, తెలుగుదేశం అభ్యర్థి నరేంద్రవర్మ సమక్షంలో శనివారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. మా దగ్గర 8 లక్షలు తీసుకున్న కత్తి రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారంటూ వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కత్తి రాజేష్‌ని కర్లపాలెం పోలీస్ స్టేషన్‌కి తెచ్చారు. ఎస్.ఐ. ఛాంబర్లో ఎస్.ఐ. జనార్దన్, కోన వెంకట్, ఇతర వైసీపీ నేతలు దాడి చేసి కొట్టారని తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపాయి. స్పందిన డీఎస్పీ మురళీకృష్ణ కత్తి రాజేష్‌పై దాడి చేసిన కోన వెంకట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఎస్.ఐ. జనార్దన్‌ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.