బెయిలు కోసం సుప్రీంను ఆశ్రయించిన నటుడు మోహన్ బాబు
posted on Jan 6, 2025 1:03PM
నటుడు మంచు మోహన్ బాబు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బెయిలు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయనకు బెయిలు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా మోహన్ బాబు అరెస్టయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
అయితే తన బెయిలు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన నాటి నుంచి అజ్ణాతంలో ఉన్న మోహన్ బాబు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య గొడవలు పీక్స్ కు చేరిన నేపథ్యంలో జల్ పల్లిలోని వారి నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు సంయమనం కోల్పోయి ఒక రిపోర్టర్ పై దాడి చేశారు. ఆ ఘటనపైనే మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు కూడా తాను దాడి చేసిన రిపోర్ట్ కు క్షమాపణ చెప్పారు. కాగా ఆ కేసులో మోహన్ బాబుకు గత నెల 24 వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఆ తరువాత దానిని పొడగించేందుకు నిరాకరిస్తూ, ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది.
దీంతో ఆ రోజు నుంచీ మోహన్ బాబు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. తన ఆరోగ్యం బాలేదనీ, ఆరోగ్యం కుదుటపడగానే తానే వచ్చి పోలీసులకు సరెండర్ అవుతాననీ లీకులు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా బెయిలు కోసం సుప్రీంను ఆశ్రయించారు.