మాస్టర్ ప్లాన్ వెనక మరో మాస్టర్ ప్లాన్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్  వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. పట్టణ నూతన మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ యువ రైతు రాములు ఆత్మహత్య చేసుకోవడంతో, పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. కామారెడ్డి మున్సిపాలిటీ తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్‌తో భూములు నష్టపోయిన రైతుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి భారీగా అన్నదాతలు తరలివచ్చారు. మరో వైపు పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మరోవైపు యువ రైతు రాములు మృతికి నిరసనగా అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. సర్పంచ్ సహా తొమ్మిది మంది వార్డు సభ్యులు రాజీనామా చేశారు. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

నిజానికి  మంత్రి కేటీఆర్ అన్నట్లుగా ఇదేమీ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ప్రభుత్వ అధికారులు  తీసుకున్న నిర్ణయం కాదు. పోలీసులు సృష్టించిన వివాదం కాదు. పక్కాగా ఒక పథకం ప్రకారం సర్కార్  స్వాములు తెర వెనక నుంచి జరిపించిన ఉదంతంగా పరిశీలకులు భావిస్తునారు. నిజమే, కావచ్చు , చావు కబురు చల్లగా చెప్పినట్లు, మాస్టర్ ప్లాన్  కు వ్యతిరేకంగా రైతులు రోడ్లమీడకు వచ్చే వరకు మౌనంగా తమ పని తాము చేసుకు పోతున్న అధికారులు, ఇప్పుడు రైతులు ఆందోళనకు దిగిన తర్వాత స్థిమితంగా వచ్చి,  ముసాయిదా ప్లాన్ మాత్రమే సిద్దమైందని, ఇంకా అప్రూవ్ కాలేదని చెప్పడం వెనక మతలబు ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

అదే నిజం అయితే, అదే విషయాన్ని రైతులకు చెప్పేందుకు జిల్లా కలెక్టర్ కున్న అభ్యంతరం ఏమిటని, రైతులు అడుగుతున్నారు. అలాగే, కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నాలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించినట్ల్గుగా  కామారెడ్డి ఎస్పీ రైతులకు సున్నితంగా దమ్కీ ఇవ్వడంలో అంతరార్ధం ఏమిటి? మరో వంక తనేమీ దమ్కీ ఇవ్వలేదని అంటూనే, ఎస్పీ మరోమారు మీడియా సాక్షిగా  తాను అనుకుంటే నిమిషంలో అంతా తీసెయ్యగలనని..  కానీ అలా చేయనన్నారు. దమ్కీ ఇచ్చేవాడినే అయితే రఘునందన్ రావు హైదరాబాద్ లోనే ఉండేవాడని ఎస్పీ పేర్కొనడం తెర వెనక కథను తెర మీదకు తెచ్చింది.

 మరోవంక కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో రైతుల ఆందోళనపై మంత్రి కేసీఆర్ స్పందించారు. అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటని కామారెడ్డి కమిషనర్ ను ప్రశ్నించారు. ఈ అంశం గురించి తనకు తెలియదని చెప్పారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజీలో ఉందన్న విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం ప్రకారం మార్పులు చేర్పులు చేస్తామని చెప్పొచ్చు కదా అని అన్నారు.మాస్టర్ ప్లాన్ వల్ల ఓ రైతు చనిపోయాడంట కదా అని కమిషనర్ను కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా మాస్టర్ ప్లాన్ ఉండాలని తానెప్పుడు చెప్పలేదని అన్నారు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్ధేశ్యం తమకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల అభ్యంతరాలను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.  ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ప్రభుత్వం ఏదో దాచే ప్రయత్నం చేస్తోంది. దాల్ మే కుచ్  కాలా హై ..అంటున్నారు.